Special story on karate sistersమట్టిలో మాణిక్యం అనే పదానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తున్నారు వీరిద్దరూ. విధి ఎన్ని అడ్డంకులు సృష్టించినా... అదరకాబెదరక లక్ష్యం వైపు దూసుకెళ్తున్నారు. సమయం దొరికినప్పుడే కరాటే సాధన చేస్తున్న ఈ అమ్మాయిలు.. ఒక్కోసారి కూలీ పనులకు కూడా వెళ్తుంటారు. ఓ వైపు చదువు, మరోవైపు కరాటే సాధన, ఇంకోవైపు కుటుంబానికి సాయంగా ఉండే వీరు.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పతకాల పంట పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు.
హైదరాబాద్ వారసిగూడకు చెందిన రవికాంత్, లక్ష్మీల ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరు. పెద్దమ్మాయి మధులిక...రెండో అమ్మాయి ఉమామహేశ్వరీ. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే తల్లిదండ్రులు.. నిరుపేదలైనా పిల్లల లక్ష్యానికి అండగా నిలిచారు. కానీ విధి ఆ కుటుంబానికి పెద్ద సమస్యనే తెచ్చిపెట్టింది. గతేడాది క్యాటరింగ్ పనిచేసి ఇంటికొస్తున్న సమయంలో రోడ్డుప్రమాదంలో తండ్రి కాలు పోయింది. తండ్రి రవికాంత్ ఇంటికే పరిమితం కాగా తల్లి లక్ష్మినే కుటుంబ బాధ్యతల్ని మోస్తోంది. తల్లిదండ్రుల కష్టం చూసిన అమ్మాయిలు ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు.
ఫస్ట్ మేం ముగ్గురం ఆడపిల్లలం అని చాలా మంది ఎగతాళి చేశారు. టీవీలో చూసి... కరాటే నేర్చుకోవాలి అనిపించింది. అందులో జాయిన్ అయ్యాయి. మేం టోర్నమెంట్ ఆడాం. అందులో మెడల్స్ వచ్చాయి. మా చెల్లె కూడా అందులో జాయిన్ అయింది. మా మాస్టార్ పేరు పూర్ణ చందర్. ఆయన ఎంతో కృషి చేసి.. మాకు నేర్పించారు.అంటే చాలా మంది ... అమ్మాయిలకు కరాటే ఎందుకు అని అనేవారు. మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. వాళ్లు అన్నింటిని తట్టుకుని మమ్మల్ని పంపించారు. -మధులిక, కరాటే క్రీడాకారిణి
ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మధులిక. ఆరేళ్ల క్రితం కరాటే శిక్షణ ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి, స్థాయిల్లో 23 పతకాలతో పాటు 2020లో ఫీమెల్ గ్రాండ్ ఛాంపియన్ షిప్‌నూ కైవసం చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఉమామహేశ్వరీ.. అక్క స్ఫూర్తితో కరాటేలోకి అడుగు పెట్టింది. ఇద్దరూ కలిసే ఉదయం, సాయంత్రం వేళల్లో కసరత్తులు చేస్తారు. చిన్న వయసులోనే కరాటేలో రాణిస్తున్న ఉమా...ఈ ఏడాది తమిళనాడు, హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. దీంతో పాటు రాష్ట్ర స్థాయిలో 7, జిల్లా స్థాయిలో ఐదు బంగారు పతకాలను సాధించి శభాష్ అనిపిస్తోంది.
నేను 9 తరగతి చదువుతున్నాను. చాలా టోర్నమెంట్స్‌లో పాల్గొన్నాను. చాలా మెడల్స్ వచ్చాయి. మా అక్క స్పూర్తితోనే నేను కరాటేలో జాయిన్ అయ్యాను. పెద్ద కోచ్ అయి అందరికి ఫ్రీగా నేర్పిద్దాం అనుకుంటున్నాను. -ఉమామహేశ్వరీ, కరాటే క్రీడాకారిణి
కరాటేలో వరుస విజయాల్ని సాధిస్తున్న వీరికి...అవేవి సునాయాసంగా రాలేదు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కష్టపడి చదువుకుంటూనే అమ్మానాన్నలకి భారం కాకుండా శిక్షణ కొనసాగిస్తు న్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితంలో తండ్రికి జరిగిన ప్రమాదం వెనెక్కినెట్టేసిందంటారు వీరు. ప్రస్తుతం కోలుకున్నా నడవలేని స్థితిలో ఉన్నారని ఆందోళన చెందుతున్నారు. కరాటేలో తమదైన ప్రతిభ చాటుతున్న అక్కాచెళ్లెళ్లు.. భవిష్యత్‌లో ఉన్నతంగా స్థిరపడాలని నిర్ధేశించుకున్నారు. పెద్దమ్మాయి మధులిక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లో చేరతాననే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
చాలా కష్టపడుతున్నారు. మా ఆయనకు యాక్సిడెంట్ కావడం వల్ల వీళ్లకు చాలా ఇబ్బందులు వచ్చాయి. ఒక పూట తింటున్నాం. మరో పూట పస్తులు ఉంటున్నాం. ఏం చేయాలో తెలియక ట్రైనింగ్‌కు కూడా పంపించడం లేదు. గవర్నమెంట్ కళాశాలలో చేర్పించాం. టోర్నమెంట్‌కు వెళ్తే 15వేలు అవుతున్నాయి. ఎవరైనా సాయం చేస్తే... బాగుంటుంది . -లక్ష్మి, కరాటే క్రీడాకారిణీల తల్లి
రెండో అమ్మాయి ఉమామహేశ్వరి ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తానంటోంది. కుటుంబపోషణ కోసం ఇళ్లల్లో పని చేస్తున్న తల్లి లక్ష్మి..కూతుళ్ల విజయాలను చూసి హర్షం వ్యక్తం చేస్తోంది. ఐతే మంచానికే పరిమితమైన భర్తకు సదరన్ సర్టీఫికేట్ ఉన్నా పింఛను అందడం లేదని ఆవేదన చెందుతోంది. కుటుంబ స్థితిగతులు అంతంతమాత్రంగానే ఉన్నా... విధి అడ్డుంకులు సృష్టించినా.. కుటుంబానికి అండగా ఉంటూనే కరాటేలో పతకాలు సొంతం చేసుకుంటున్న అక్కాచెళ్లెళ్లు యువతరానికి ప్రేరణగా నిలుస్తున్నారు.
ఇవీ చూడండి