రాష్ట్ర రాజధానిలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రానున్న నీటి ఎద్దడిని సూచిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణే ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక. దేశంలోని 21 ప్రధాన నగరాల్లో... 2020 నాటికి భూగర్భజలాలు సున్నా స్థాయికి చేరుకుంటాయని నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టం చేసింది. అందులో హైదరాబాద్ ఉండటం శోచనీయం. ఇందుకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి నగరంలోని కీలక ప్రాంతాలు. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హఫీజ్ పేట్, నానక్ రాంగూడ లాంటి చోట్ల నిర్మాణాలు కనివినీ ఎరుగని రీతిలో పెరగడం వల్ల భూగర్భ జలాలు అట్టడుగుస్థాయికి పడిపోయాయి. జంట జలాశయాలకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు 100 అడుగులు తవ్వితే నీళ్లు వచ్చేవి. ఇప్పుడు అదే చోట 1500 నుంచి 2000 అడుగుల లోతుకు వెళ్లినా నీటిజాడ లేదు.
ఐటీ కారిడార్‌తో పాటు తిరుమలగిరి, మల్కాజిగిరి, కూకట్ పల్లి, అమీర్ పేట, సంజీవరెడ్డి నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నీటిని తోడేస్తున్నారు. అదే స్థాయిలో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాల్లోనూ నీటి నిల్వలు ఏటికేడు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక మూసీ నదిని ఆనుకొని ఉన్న అసీఫ్‌నగర్, బహదూర్‌పుర, చార్మినార్, అంబర్ పేట్, నాగోల్, ఉప్పల్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కొంతమేర ఆశించిన స్థాయిలోనే ఉన్నాయి. నగరంలో భూమిలోకి పంపించే నీటికంటే 340శాతం ఎక్కువగా తోడుతున్నారని భూగర్భజల శాఖ, జలమండలి, ఎన్జీఆర్ఐ అధ్యయనంలో తేలింది.
ఇదీ చూడండి: జల సంరక్షణకు కదం తొక్కిన మహిళా శక్తి