సామాజిక మాధ్యమాల హవా విపరీతంగా పెరిగింది. ఆ క్రమంలోనే యువత నచ్చిన పని చేస్తూనే వినూత్నమార్గాల్లో ఆదాయం సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో ఫుడ్ బ్లాగింగ్ ఒకటి. ఎక్కడో ఒక చోట.. సరికొత్త వంటకాలు రుచి చూసి... ఆకట్టుకునే విధంగా చెప్పటమే ఫుడ్ బ్లాగింగ్. అలా హైదరాబాదూ ఫుడ్ బ్లాగింగ్‌కు అడ్డాగా మారిపోయింది.
ఆ సందేహలకు సమాధానం ఫుడ్ బ్లాగింగ్
ఇంట్లో రుచికరంగా ఎన్ని వంటకాలు చేసుకున్నా.. అప్పుడప్పుడు బయటకెళ్లి కొత్తరుచులు ఆస్వాదించాలనే కోరిక అందరికీ ఉంటుంది. ముఖ్యంగా, ఇతరప్రాంతాలకు వెళ్లినప్పుడు రెస్టారెంట్లలో తినడానికే చాలామంది మెుగ్గు చూపుతారు. కానీ, ఏయే ప్రాంతాల్లో ఎలాంటి వంటకాలు దొరుకుతాయి..? ఫలానా, రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఏ వంటకం తప్పకుండా రుచి చూడాలి...? ఇలాంటి సందేహల్ని ఎవరు తీరుస్తారు అనే వారికీ సమాధానంగా నిలుస్తున్నారు.. ఫుడ్ బ్లాగర్స్.
కొంచెం కష్టపడితే చాలు
సాధారణంగా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు... కొత్తగా తినే వంటకాలు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తుంటాం. అయితే, అలాంటి ఫొటోలను మరింత కళాత్మకంగా తీసి... ఆయా ఆహార పదార్థాల గురించి చక్కగా వివరిస్తూ సామాజికమాధ్యమాల్లో పంచుకోవడమే... ఫుడ్ బ్లాగింగ్. మెుదట్లో కొంచెం కష్టపడితే చాలు! తక్కువకాలంలోనే మంచి ఆదరణ దక్కించుకోవచ్చని చెబుతున్నారు... యువ ఫుడ్ బ్లాగర్స్.
బస్తీలకు చేరువైంది
ఫుడ్‌బ్లాగర్స్‌కి ఆన్‌లైన్ వేదికగా వెయ్యి మంది ఫాలోవర్స్ ఉంటే చాలు. తమ బ్రాండ్స్‌ను ప్రచారం చేయమని రెస్టారెంట్లు నిర్వాహకులు వెంటపడుతున్నారు. ఫాలోవర్స్ మరీ ఎక్కువగా ఉంటే... పీఆర్ ఏజెన్సీలు వంటి సంస్థలు స్వయంగా కలిసి మరీ, తమ వంటకాలకు ప్రచారం కల్పించమని భారీ మెుత్తంలో పారితోషికాలు అందిస్తున్నాయి. ఫుడ్ బ్లాగింగ్ ఒకప్పుడు విదేశాలకే పరిమితం. కానీ, ఈ ఐదేళ్లలో దేశంలో దానికి ఆదరణ బాగా పెరిగింది. ఎంతలా అంటే, జూబ్లీహిల్స్‌లో ఉండే వారికీ మాత్రమే కాదు... బస్తీల్లో ఉండే యువతకూ ఫుడ్ బ్లాగింగ్ చేరువైంది.
సినీతారలు కూడా
ఈ మధ్య సినీతారలూ ఫుడ్ బ్లాగింగ్‌పై మనసు పారేసుకుంటున్నారు. అభిమానులతో తమకు నచ్చిన వంటకాలు గురించి ముచ్చటిస్తున్నారు. బ్లాగింగ్ ద్వారా సెలబ్రెటీలు అయినవారు లేకపోలేదు. అయితే, ఈ అభిరుచి కోసం పని మానేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... కొంతమంది ఫుడ్ బ్లాగర్స్... నచ్చిన ఉద్యోగం చేసుకుంటూనే వారాంతాల్లో సరదాగా వీడియోలు చేస్తూ... జీతంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
వేల సంఖ్యలో ఫుడ్ బ్లాగర్స్
సరికొత్తగా ప్రయత్నించాలనుకునే వారికీ.... ఫుడ్ బ్లాగింగ్ ఒక మంచి వేదిక. మెుదట్లో.. హైదరాబాద్‌లో పదుల సంఖ్యలోనే ఫుడ్ బ్లాగర్స్ ఉండేవాళ్లు. ప్రస్తుతం ఆ సంఖ్య వేలకు చేరింది. ఆదాయం కంటే ఆనందానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే యువత... ఇలాంటి వేదికలతో రెండింటిని పొందుతూ హాయిహాయిగా సాగిపోతున్నారు.