ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం బెల్లంపూడిలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం స్లాబ్ కింద 70 సంవత్సరాల వయస్సు గల వృద్ధురాలు ఉంటోంది. మూడు నెలలుగా ఎండ, వానలను తట్టుకొని అక్కడే జీవనం సాగిస్తోంది. ఆమె పరిస్థితి గమనించి స్థానికులు ఆహారం అందిస్తున్నారు. ఊరు, పేరు అడిగితే అమలాపురం అని తన పేరు చల్లా సత్యవతి అని ఒక కుమారుడు ఉన్నాడు అని.. భర్త చనిపోయాడని చెబుతుంది. అంతకు మించి ఏ ఒక్క ప్రశ్న అడిగినా.. చిరునవ్వుతో మౌనంగా ఉంటోంది.
నా పేరు చల్లా సత్యవతి అండి. మా ఆయన పౌరహిత్యం చేసేవారండి. మీలాంటి వాళ్లకి పెళ్లిళ్లు చేసేవారు. గుండెపోటుతో చనిపోయారండి. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.. వాళ్లు కవలలండి. ఓ కొడుకు ఉన్నాడు. తాను కూడా మీలాంటి వాళ్లు పెడితే తింటాడు. లేకుంటే ఎక్కడికైనా వెళ్తాడు. మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాడు. నేను తినకపోయిన ఉండగలను అండి. ఎవరో తినమని రాత్రి ఇస్తే తినకుండా పడుకున్న. పొద్దున్న లేచి అది తినేసా.
-వృద్ధురాలు
మానవతావాదులు పట్టించుకుని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పిస్తే ఆమెకు మేలు చేసినవారవుతారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇంత గడ్డు పరిస్థితుల్లోనూ.. ఆమె చిరునవ్వు ఎక్కడా చెరగటం లేదు. ఎవరు వెళ్లి పలకరించినా.. నవ్వుతూ సమాధానం చెబుతోంది. ఆమె ఆత్మస్థైర్యాన్ని చూసిన చుట్టు పక్కల ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండీ.. ETELA: ఈటల పాదయాత్రకు బ్రేక్... హైదరాబాద్ తరలింపు