రాష్ట్రానికి ఆక్సిజన్ తరలింపులో దక్షిణ మధ్య రైల్వే నిరంతరాయంగా సరఫరా చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రానికి 9వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఇవాళ ఒడిశా నుంచి హైదరాబాద్ సనత్‌నగర్ రైల్వే గూడ్స్ కాంప్లెక్స్‌కు చేరుకుంది. దీనికోసం ఎలాంటి ఆటంకాలు లేకుండా రైల్వేశాఖ ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసింది.
ఈ రైలు ఒడిశాలోని రూర్కీ నుంచి 119.45 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను నింపుకుని 6 ట్యాంకర్లను తీసుకొచ్చింది. రూర్కీ నుంచి ప్రారంభమైన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ 1,320 కిలో మీటర్ల దూరాన్ని 22 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకుందని రైల్వే శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి 774.37 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వచ్చినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. గమ్యస్థానాలకు వీలైనంత త్వరగా చేరుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు.