South Central Railway: సికింద్రాబాద్-పుణె మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత పునరుద్ధరించారు. కొవిడ్ నేపథ్యంలో రద్దయిన రైలు మళ్లీ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ బండికి కొత్త హంగులద్దుతూ అన్నీ ఆధునిక ఎల్‌హెచ్‌బీ(లింక్ హాఫ్మన్ బుష్) బోగీలను ఏర్పాటుచేశారు. ఇందులో అద్దాల బోగీలో ఆహ్లాదకర ప్రయాణం చేసేలా ఓ విస్టాడోమ్ కోచ్‌ను కొత్తగా చేర్చడం అదనపు ఆకర్షణ.
దక్షిణ మధ్య రైల్వేలో ఇలాంటి కోచ్‌తో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి రైలు ఇదే. ఇదే రైల్లో.. విమాన టికెట్ల మాదిరి ‘డైనమిక్ టికెట్ల విధానం’ ప్రవేశపెట్టి ప్రయాణికులపై బాదుడును రైల్వేశాఖ షురూ చేసింది.
పెద్దపెద్ద కిటికీలు..పైకప్పూ అద్దాలతోనే: పుణె-సికింద్రాబాద్-పుణె (నెం.12026/12025) రెండువైపులా రాకపోకలు సాగించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మార్గమధ్యలో బేగంపేట, వికారాబాద్, తాండూర్, వాడి, కలబురిగి, శోలాపుర్ స్టేషన్లలోనే ఆగుతుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. బోగీలో రెండువైపులా సాధారణ కిటికీలకు బదులుగా పెద్దపెద్ద అద్దాల కిటికీలు ఉంటాయి.
కోచ్ పైకప్పూ మందపాటి గాజుతో చేసిందే. ప్రయాణ సమయంలో రైలుమార్గానికి ఇరువైపులా కొండలు, లోయలు, జలపాతాలు వంటి ప్రకృతి అందాలను.. రాత్రివేళలో నింగిలోని నక్షత్రాలను చూస్తూ ముందుకు సాగవచ్చు. ప్రయాణమార్గంలో అనంతగిరి కొండలను, బిగ్వాన్ దగ్గర డ్యామును చూడొచ్చు. విస్టాడోమ్ కోచ్‌లో ఎల్‌ఈడీ లైటింగ్, సీట్లను పుష్‌బ్యాక్‌తో 180 డిగ్రీలవైపు తిప్పుకోగలిగే సౌకర్యంతో పాటు లాంజ్ కూడా ఉంటుంది.
సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 2.45కు బయల్దేరి అదేరోజు రాత్రి 11.10కి పుణె చేరుతుంది. పుణెలో ఉదయం 6.00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
* ఈ రైల్లో ఒక విస్టాడోమ్ కోచ్, 2 ఎగ్జిక్యూటివ్ తరగతి, 9 ఏసీ చైర్‌కార్ కోచ్‌లు ఉంటాయి.
ఇవీ చదవండి: రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటానంటోన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి