Free WIFI AT Railway stations : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రయాణీకుల కోసం హై స్పీడ్ వై-ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హాల్ట్ స్టేషన్లను మినహా అన్ని రైల్వే స్టేషన్లలో 588 రైల్వే స్టేషన్లలో హై -స్పీడ్ వై-ఫై సౌకర్యాన్ని విస్తరించిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ద.మ. రైల్వే నెట్‌వర్క్‌లో సుమారు 6,000 రూట్ కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌తో విస్తరించి ఉంది. భారీ స్థాయిలో రైల్వే స్టేషన్లు డిజిటల్ హబ్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 588 స్టేషన్లలో వై-ఫై సౌకర్యం కల్పించారు. వీటిలో 30 మేజర్ నాన్ సబర్బన్ గ్రేడ్ స్టేషన్లు, 558 మధ్యతరహా, చిన్న స్టేషన్లు ఉన్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వేలోని హాల్ట్ కేటగిరి స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లలో హై స్పీడ్ వై-ఫై సౌకర్యం కల్పించిందని వెల్లడించింది.
దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్లయిన సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నాందేడ్ మొదలైన స్టేషన్లలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఈ సౌకర్యంతో నెట్‌వర్క్ అత్యుత్తమంగా అందుబాటులో ఉంటుందని ప్రయాణీకులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. రైలు ప్రయాణీకులకు మెరుగైన ఇంటర్నెట్ అందుబాటులో ఉండేలా ఉచిత వై-ఫై సర్వీసు తీసుకొచ్చామని రైల్వేశాఖ పేర్కొంది. ప్రతిరోజు మొదటి 30 నిమిషాలు వరకు ఉచిత వై-ఫై సౌకర్యం పొందవచ్చు. తర్వాత ఆన్‌లైన్ ద్వారా నామమాత్రపు ఛార్జీలను చెల్లించి ఈ సేవలను కొనసాగించుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది.
ఇదీ చూడండి: Urban Forest Blocks Telangana : రెండేళ్లలో 12 అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి