రైళ్ల నిర్వహణలో కీలకమైన పాత్ర పోషిస్తున్న లోకో పైలట్లు, గార్డులు,రన్నింగ్ సిబ్బంది, విధుల్లో భాగంగా హెడ్ క్వార్టర్‌కు దూరంగా ఉండే సమయాన్ని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ఆలోచన చేసి సరుకు రవాణా రైళ్లలో రౌండ్ ట్రిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
రోజురోజుకు విస్తరిస్తున్న కొవిడ్-19ని కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వరకు అన్ని రకాల ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినప్పటికీ... నిత్యావసర సరుకుల రవాణాను భారతీయ రైల్వే నిరంతరం కొనసాగిస్తుంది. ఈ సమయంలో రైల్వే సిబ్బంది, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లు, టెక్నీషియన్లు, ఇంజనీర్లు, సెక్షన్ కంట్రోలర్లు, గ్యాంగ్ మెన్లు, గార్డులు, లోకో పైలట్లు సరుకు రవాణా రైళ్లను నడపడంలో కీలక భూమిక పోషిస్తున్నారు.
రన్నింగ్ స్టాఫ్‌కు ప్రయోజనం
సాధారణ పరిస్థితుల్లో రన్నింగ్ సిబ్బంది(లోకో పైలట్లు, గార్డులు) హెడ్ క్వార్టర్‌కు దూరంగా చాలా సమయం రన్నింగ్ రూముల్లో ఉండాల్సి వచ్చేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికుల రైళ్లు రద్దయ్యాయి. ఫలితంగా గూడ్స్ రైళ్ల సగటు వేగం పెరిగినందున ప్రయాణ సమయం తగ్గింది. ఈ విధానంలో సాధ్యమైనంత వరకు రన్నింగ్ స్టాఫ్‌ని తక్కువ దూరాల ట్రిప్పులకు వినియోగిస్తున్నారు. ఔట్ గోయింగ్ ట్రిప్ డ్యూటీ పూర్తైన వెంటనే హెడ్ క్వార్టర్ వైపు వచ్చే రైళ్లకు వారిని పంపించేస్తున్నారు. దీనివల్ల ప్రధాన కార్యాలయానికి దూరంగా ఉండే సమయం తగ్గి త్వరగా హెడ్ క్వార్టర్స్‌కు చేరుకుంటున్నారు. ఈ విధానంతో 80శాతం రన్నింగ్ స్టాఫ్‌కు ప్రయోజనం కలుగుతుంది.
ప్రత్యేక జాగ్రత్తలు
అప్పుడప్పుడూ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో, రన్నింగ్ సిబ్బందిలో కొందరు తిరుగు ప్రయాణానికి ప్రధాన కార్యాలయానికి చేరుకునేందుకు వెంటనే గూడ్స్ రైలు లేక.. రన్నింగ్ రూమ్‌లో విశ్రాంతి తీసుకోవలసి వస్తుంది. వీరి ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు రన్నింగ్ రూమ్‌లను తరచుగా హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తూ, వ్యక్తిగత దూరం పాటించేలా వారి పడకలను ఏర్పాటుచేయడం, వారికి ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా కిట్లు
ఇదే కాక ఉద్యోగుల సంక్షేమం కోసం ద.మ.రైల్వే మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేడం ద్వారా యంత్రాలను తాకకుండా ఉండే వెసులుబాటు కల్పించారు. డ్యూటీ చేపట్టే ముందు అన్ని క్రూ బుకింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్కానింగ్ నిర్వహించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని డివిజన్లవారు డెటాల్ సబ్బు, 200 మి.లీ శానిటైజర్, 3 పొరల మాస్కు, ఒక జత గ్లవ్స్, టిష్యూ పేపర్లతో కూడిన కిట్లను రన్నింగ్ స్టాఫ్.. డ్యూటీకి రిపోర్టు చేసిన వెంటనే అందిస్తున్నారు.
ఇదీ చూడండి: వైద్యులకు బయోసూట్... రూపొందించిన డీఆర్డీవో