మెట్రోరైలు నగరంలో 69.2 కిలోమీటర్ల మేర మూడు మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో లాక్‌డౌన్‌కు కొద్దిరోజుల ముందే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్-2 ప్రారంభమైంది. ఈ మార్గంలో బోయిగూడ వద్ద మలుపుల్లో మెట్రోరైలు వెళ్లేటప్పుడు శబ్దాలు ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రాంతవాసులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ మెట్రో మార్గం వంపు ఎక్కువగా ఉంది. రైలు వెళ్లేటప్పుడు ట్రాక్, చక్రాల నడమ రాపిడితో ఎక్కువ శబ్దం వస్తోంది.. ట్రాక్ కొత్తదని, కొన్నాళ్లకు శబ్దాలు తగ్గిపోతాయని అధికారులు చెప్పారు.
లాక్‌డౌన్ తర్వాత అంతే..
లాక్‌డౌన్ తర్వాత తాజాగా రైళ్లు ప్రారంభమయ్యాక కూడా ఆ ప్రాంతీయులకు పాత అనుభవమే ఎదురైంది. ప్రతి ఐదారు నిమిషాలకు ఒక మెట్రో వెళ్తున్న సమయంలో సమీప నివాసితులు రాపిడి శబ్దాలను భరించలేకపోతున్నారు. కుదుపులు సైతం వస్తున్నందున పిల్లలు, వృద్ధులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు.
అన్ని కారిడార్లలో ఇదే పరిస్థితి
ఇతర మార్గాల్లో.. నాగోల్-రాయదుర్గం, ఎల్‌బీనగర్-మియాపూర్ మార్గాల్లోనూ పరిమితికి మించి శబ్దాలు వస్తున్నాయి. కారిడార్-3లో గ్రీన్‌ల్యాండ్స్ నుంచి యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ వరకు రైలు ఇళ్లకు సమీపంలోకి వెళుతోంది. ఈ ప్రాంతవాసులు కూడా శబ్దాలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇక రైలు లోపల ప్రయాణికులదీ అదే పరిస్థితి. లోపల 68 డెసిబుల్స్ మించకూడదు.అంతకుమించే ఉంటోందని వాపోతున్నారు. గరిష్ఠ వేగం గంటకు 72 కి.మీ.కు వెళ్లినా మెట్రో లోపల శబ్దం 72 డెసిబుల్స్ మించకూడదు. అదే బయట అయితే 85 డెసిబుల్స్ మించొద్ధు ఈ ప్రమాణాల అమలు పక్కాగా లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ ఆసుపత్రి స్టేషన్ మధ్యలో బోయిగూడ వై కూడలి స్తంభం 29 దగ్గర మలుపు ఎక్కువగా ఉంది. ఇక్కడ రైలు వెళ్లేటప్పుడు ట్రాక్, మెట్రోకి మధ్య రాపిడితో అధిక శబ్దాలు వస్తున్నాయి. చర్యలు తీసుకోవాలని మెట్రోరైలు ఎండీకి మంగళవారం ఫిర్యాదు చేశాం.
- డాక్టర్ జి.హనుమానులు, అధ్యక్షుడు, ఎంన్‌ఎన్‌కే విట్టల్ సెంట్రల్ కోర్టు ఫ్లాట్ యాజమానుల సంక్షేమ సంఘం.
ఇవీ ప్రమాణాలు..
- నివాసాల చెంత 50-70 డెసిబుల్స్
- వ్యాపార ప్రాంతాలు 75
- ఆసుపత్రులు 60
ఇదీ చూడండి: ట్రంప్ X బైడెన్: కరోనా విషయంలో అబద్ధాలు ఎవరివి?