తెలంగాణ భాజపాలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కృష్ణదాస్ శనివారం హైదరాబాద్ వచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తిచేయడం.. రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలతో మాట్లాడి ఏకాభిప్రాయం తీసుకురావడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఈ వారం, పదిరోజుల్లోపే తెలంగాణ భాజపా అధ్యక్షుడి పేరును పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రకటించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి డి.కె.అరుణ, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పేర్లూ ప్రచారంలోకి వచ్చాయి. అయితే పార్టీలో కొత్తగా చేరిన వారికి అవకాశం లేదని జాతీయ నాయకత్వం సంకేతాలు ఇచ్చినట్లు కీలక నేత ఒకరు తెలిపారు.
కొత్త, పాత నాయకులతో విస్తృత చర్చ..?
- లక్ష్మణ్‌ను కొనసాగించాలని సీనియర్ నేతల్లో ఎక్కువమంది చెప్పినట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఆయనవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
- ఆరెస్సెస్‌లోని ఓ పక్షం మాత్రం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు గట్టిగా మద్దతు పలుకుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో కొత్త, పాత నాయకులతో పాటు సంఘ్ పరివార్‌లో అన్ని క్షేత్రాలతో కలిసి పనిచేయగలగడం కోణంలో సీనియర్ నేతగా లక్ష్మణ్‌కు అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
- మార్పు జరిగితే మాత్రం బండి సంజయ్‌వైపే మొగ్గు చూపవచ్చన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏకాభిప్రాయం కుదిరిన నేతల పేర్లతో జాబితా
పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కృష్ణదాస్.. లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావులతో శనివారం రాత్రి హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. మెజార్టీ జిల్లాలకు ఏకాభిప్రాయం కుదిరిన నేతల పేర్లతో జాబితాను రూపొందించారు. జిల్లాల కొత్త అధ్యక్షుల పేర్లను ఇవాళ ప్రకటించనున్నట్లు తెలిసింది.
ఇవీ చూడండి: సహకార పోరులో తెరాస మద్దతుదారుల హవా