Social Media Election Campaign in Telangana : రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్ కృషి చేస్తుంటే.. పదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.
Telangana Election Campaign in Social Media : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో.. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం హోరందుకుంది. ఒక వైపు అధికార బీఆర్ఎస్ నేతలు.. అన్ని నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్తుంటే.. మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచార జోరు పెరిగింది. పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా రాజకీయాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందకు మొగ్గు చూపుతున్నారు.
Telangana Assembly Elections 2023 : అలాగే ఎన్నికల పుణ్యమా అని సోషల్ మీడియా ప్రభావితుల(Social Media influencers) పంట పండింది. ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నవారికి గాలమేస్తున్న రాజకీయ పార్టీలు వారిని ప్రచారానికి వాడుకుంటూ అడిగిన మొత్తాన్ని చేతిలో పెడుతున్నాయి. సరదాగా రీల్స్ చేస్తూ కంటెంట్ ఇస్తూ అనుచరులను పెంచుకుందామని చేసిన ప్రయత్నాలు.. ఇప్పుడు వారికి సరికొత్త ఆదాయాన్ని తెస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పాటలు ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇందులో భాగంగా వాటిపై రీల్స్ చేయడం, పార్టీ నేతల ప్రచారాలు, జనాల స్పందన ఇతరత్రా వీడియోలను ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఖాతాల్లో పెడుతూ మరింత ప్రచారం కల్పిస్తున్నారు.
యువతే టార్గెట్‌గా ప్రచారం ట్రెండ్ ఫాలో అవుతున్న బీఆర్‌ఎస్ నేతలు
సోషల్ మీడియాలో రీల్స్‌కు భలే ఆదరణ : ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ యుగంలో అనేకమంది గంటల తరబడి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేక్‌బుక్‌లలో రీల్స్‌ను చూసేందుకు ఇష్టపడుతున్నారు. లక్షల మంది ఇలా నిత్యం సుమారు రెండు, మూడు గంటల పాటు వాటికి కేటాయిస్తున్నారంటూ కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీంతో మంచి కంటెంట్‌తో రీల్స్ చేసేవారికి వచ్చే పాపులారిటీ సినిమా నటులతో పోలి ఉంటోంది. ఉత్సాహవంతులైన ఖాతాదారులు తమ ఫాలోవర్లను పెంచుకునేందుకు వినూత్నమైన కంటెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మిలియన్ల మందిని ఆకర్షిస్తున్నారు. ఇలాంటి వారితో ప్రచారం చేయిస్తే సులువుగా ఎక్కువ మందికి చేరొచ్చని ఆలోచించిన ఆయా రాజకీయ పార్టీల వార్‌రూమ్‌ల ప్రతినిధులు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. వారి వీడియోలకు ఎక్కువ వ్యూయర్‌షిప్ ఉంటే రెట్టింపు ముట్టజెప్పేందుకూ కూడా ఏమాత్రం వెనకాడటం లేదు.
Telangana Leaders Election Campaign In Social Media : మిలియన్లలో సబ్‌స్క్రైబర్‌లున్న ఖాతాలు, యూట్యూబ్ వ్లాగర్లు, బ్లాగర్లను ఎంపిక చేసిన ఆయా పార్టీల వార్‌రూమ్ ప్రతినిధులు.. ఈ తరహా ప్రచారంలో జోరు పెంచారు. రోజూ వారి ఖాతాల్లో ఎలాంటి కంటెంట్ ఉండాలో ముందే నిర్దేశిస్తూ స్పందనను ఎప్పటికప్పడు చేరవేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ఆయా పార్టీల నేతలు, ట్రావెల్, ఫుడ్, హోమ్ మేకింగ్ సంబంధిత వ్లాగ్‌లు చేస్తున్నవారితో పాటు కొంతమంది నటీనటులను సంప్రదించి ఇప్పటికే తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రధాన పార్టీల విషయానికొస్తే.. బీఆర్ఎస్ విడుదల చేసిన 'గులాబీ జెండాలమ్మ', కాంగ్రెస్ పార్టీకి చెందిన 'మా తాత కాంగ్రెస్, ముత్తాత కాంగ్రెస్', బీజేపీకు చెందిన 'తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా' అనే పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి.