SIT is preparing to take action against Revanth Reddy: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి ఇవాళ సిట్ విచారణలో ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన నిరాధారమైన ఆరోపణలు చేశారనే కోణంలో చర్యలకు సిద్ధమవుతున్నట్లు సిట్ పేర్కొంది. న్యాయ సలహాలు తీసుకొని రేవంత్‌పై చర్యలు తీసుకుంటామని సిట్ స్పష్టం చేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో గ్రూప్-1 పేపర్ అంశంపై పలు ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి.. ఒకే మండలంలో 100 మందికి 100కు పైగా మార్కులు వచ్చాయని గతంలో ఆరోపించారు. ఈ ఆరోపణలపై వివరణ కోరుతూ ఇటీవల రేవంత్‌కు సిట్ నోటీసులు ఇవ్వగా.. ఇవాళ సిట్ అధికారులను కలిసి వివరణ ఇచ్చారు.
విద్యార్థులు, నిరుద్యోగుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్‌సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్‌దేనని విమర్శించారు. జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. కేటీఆర్ పీఏ తిరుపతి, రాజశేఖర్ రెడ్డికి ఈ కేసులో భాగస్వామ్యం ఉందన్నారు. సిట్ ద్వారా నోటీసులిచ్చి ప్రతిపక్షాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
తన వద్ద ఉన్న సమాచారాన్ని సిట్ అధికారికి అందించానని పేర్కొన్న రేవంత్.. పేపర్ లీకేజీపై తాను, సంజయ్, కేటీఆర్ ముగ్గురం స్పందించామని.. సిట్ మాత్రం తనకు, సంజయ్‌కు నోటీసులిచ్చి కేటీఆర్‌కు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చినా ఏపీ అధికారుల చేతిలోనే తాళాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు తెలంగాణ బిడ్డ దొరకలేదా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిడ్డల త్యాగాలను కేసీఆర్ అపహాస్యం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Revanth Reddy comments on Andhra employees: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుడు ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన వ్యక్తిగా రేవంత్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్.. 60 ఏళ్ల పోరాటాన్ని, 1200 మంది విద్యార్థుల బలిదానాలను, 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును రాజమండ్రికి చెందిన ప్రవీణ్ కుమార్ చేతిలో పెట్టారని ఆరోపించారు.
జరిగిన నష్టాన్ని విచారణ చేయడానికి తెలంగాణకు చెందిన అధికారి లేడని దుయ్యబట్టారు. తెలంగాణకు చెందిన నిజాయితీ గల అధికారులు ఎందరో ఉన్నారని కొనియాడిన రేవంత్‌రెడ్డి.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును విచారిస్తున్న సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ విజయవాడకు చెందిన వ్యక్తిగా ఆరోపించారు.
ఇవీ చదవండి:
'కేటీఆర్ వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని సిట్ అధికారికి చెప్పా'
టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల నిర్వహణలో ఇకపై భారీ మార్పులు..!
పేపర్ లీకేజీలో.. టీఎస్పీఎస్సీ కమిషన్‌లోని 40మంది సిబ్బందికి సిట్ నోటీసులు