SI Preliminary Exam: రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఎస్సై ప్రాథమిక పరీక్షకు హైదరాబాద్ సహా 20 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 554 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 2,47,217 దరఖాస్తులు రాగా.. ఇవాళ పరీక్షకు 91.32 శాతం మంది హాజరైనట్లు రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది. మొత్తం 2లక్షల25వేల759 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్ష కీ ని త్వరలో www.tslprb.in వెబ్ సైట్ లో ఉంచుతామని రిక్రూట్ మెంట్ బోర్డ్ వెల్లడించింది. ప్రాథమిక రాత పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో 503 పరీక్ష కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో 35 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు.
మార్కుల కుదింపు..: ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించే మార్కులను తొలిసారిగా కుదించారు. గత పరీక్షల్లో సామాజిక వర్గాలవారీగా మార్కులుండేవి. ఈసారి సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30శాతం మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో అబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలున్నాయి. వీటిలో 30 శాతం మార్కులు సాధిస్తే పరీక్ష గట్టెక్కినట్లే... అంటే 60 ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించగలిగితే చాలు అర్హత సాధించినట్లే.
నెగెటివ్ మార్కులతో జాగ్రత్త: మరోవైపు ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు నెగెటివ్ మార్కులుండటం కీలకంగా మారింది. ఐదు తప్పుడు సమాధానాలు రాస్తే ఒక మార్కు కోత విధించనున్నారు. అందుకే సరైన సమాధానాలు తెలిసిన ప్రశ్నలపైనే దృష్టి పెట్టాలి. పరీక్షలో 60 సరైన జవాబులను పక్కాగా గర్తించగలికే చాలు. తెలియని ప్రశ్నలకూ సమాధానాలు రాస్తే నెగెటివ్ మార్కులతో మొదటికే మోసం రావచ్చు. తుది రాత పరీక్షలో మాత్రం నెగటివ్ మార్కులుండవు.
సమాజంలో గుర్తింపున్న ఉద్యోగం... ఆరంభంలోనే ఆకర్షణీయ వేతనం... యూనిఫాం కొలువు కావడంతో యువతలో ఆసక్తి... ఈ కారణాలే పోలీసు కొలువుల పట్ల మక్కువను పెంచేలా చేశాయి. అయితే ప్రస్తుత పోలీసు ప్రాథమిక రాతపరీక్ష అందుకు భిన్నంగా ఉంది. ఇది వడపోత ప్రక్రియ మాత్రమే... దరఖాస్తుదారుల ప్రాథమిక స్థాయి పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు ఉద్దేశించింది. ఈ మార్కుల్ని తుది ఫలితాల్లో పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. అందుకే ఎక్కువ మార్కులు సాధించాలన్న ఒత్తిడి అవసరం లేదని మండలి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవీ చదవండి: 1.12 లక్షల మందికి డిగ్రీ సీట్లు.. 1.11 లక్షల బీటెక్ సీట్లకు ఏఐసీటీఈ అనుమతి
లార్డ్ మౌంట్బాటెన్.. వలస పాలన ముగించిన వీరుడా?.. అగ్గిరాజేసిన విలనా?