Show Cause Notices to Komatireddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారి భాజపాలో చేరి మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారడంతో అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా కల్పించే నాయకుడు లేకుండా పోయింది. దీంతో కోమటిరెడ్డి సోదరుల అభిమానులు, అనుచరులు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. ఎవరి తరఫున ప్రచారం చేయాలో తెలియక వెంకట్‌రెడ్డి అయోమయంలో పడ్డారు. తన సోదరుడు పార్టీ వీడినప్పటి నుంచి వెంకట్‌రెడ్డి తరచూ పార్టీని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై విమర్శలు చేశారు.
ఆడియో వైరల్: మరోవైపు తరచూ కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసి భాజపా అభ్యర్థి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆధారాలేం లేకపోవడంతో ఏఐసీసీ నాయకత్వం వేచి చూసింది. రెండ్రోజుల కిందట మునుగోడుకు చెందిన జబ్బార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి తన తమ్ముడికి ఓటు వేయాలని సూచించారు. ఇదే ఆడియో బయటకు వచ్చి వైరల్ అయ్యింది. ఆ మరుసటి రోజు వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన మరోసారి మునుగోడులో కాంగ్రెస్‌ను బలహీన పరిచేలా చేసింది.
ఈ రెండు అంశాలను రాష్ట్ర కాంగ్రెస్ ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. విషయాన్ని పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. పది రోజుల్లోపు సమాధానం ఇవ్వకపోతే తదుపరి పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో కోమటిరెడ్డి సోదరులతో ఉన్నకార్యకర్తల్లో కొందరు ఇంతకాలం అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఏఐసీసీ తీసుకున్న చర్యలతో వారిలో స్పష్టత వచ్చినట్లయిందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇవీ చదవండి: తమ్ముడికే ఓటెయ్యండి.. సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్..
మునుగోడు ఫలితాలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
తారాస్థాయికి చేరిన ప్రచారం.. చిన్న పార్టీలతో పెద్ద పార్టీలకు చిక్కులు
హిమాచల్‌లో త్రిముఖ పోరు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై కాంగ్రెస్ కన్ను!