ఉస్మానియా ఆసుపత్రిలోని ఐసోలేషన్, ఐసీయూ రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పడకలను పది నుంచి 40 వరకు పెంచినా.. సక్రమంగా సేవలు అందని దుస్థితి. 40 మంది రోగుల పర్యవేక్షణకు ఒకరు లేదా ఇద్దరు నర్సులనే కేటాయిస్తుండటం గమనార్హం. గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్ సేవల కింద మార్చడంతో ఉస్మానియాకు రోగుల తాకిడి పెరిగింది. మరోవైపు ఆసుపత్రిలో సరిపడ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది లేక ఉన్నవారితోనే నెట్టుకొస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కొన్ని రోజులుగా పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
వారే ఎక్కువ
అత్యవసర కేసుల్లో ఎక్కువ శాతం శ్వాసకోశ సంబంధిత రోగులు ఉంటున్నారు. వీరితోపాటు కిడ్నీ, గుండె, ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలైన వారు వస్తున్నారు. ఐసీయూలో సరిపడ వెంటిలేటర్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో పడకల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సైతం చివరి క్షణంలో రోగులను ఉస్మానియాకు పంపి చేతులు దులుపుకొంటున్నాయి. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోతుండటంతో వైద్యులు ఏమి చేయలేకపోతున్నారు. మృతుల సంఖ్య మాత్రం ఉస్మానియా ఆసుపత్రి ఖాతాలో పడుతోంది. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి రోగుల తాకిడి మేరకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
నిత్యం 10-12 కరోనా పాజిటివ్‌లు
ఉస్మానియాకు వస్తున్న కరోనా లక్షణాల బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. ఇలా పంపిన వారిలో నిత్యం 10-12 మందికి పాజిటివ్ వస్తోంది. వారిలో అప్పటికే కొందరికి తీవ్ర శ్వాసకోశ సమస్యలు ఏర్పడి మృత్యువాత పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. మిగతా వారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఐసీయూ, ఐసోలేషన్‌లో పడకలు విస్తరించడం వల్ల స్థలాభావం ఏర్పడుతోంది. రోగుల మధ్య నిర్ణీత దూరం ఉండటం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో సరిపడ సిబ్బంది, మౌలిక వసతులు కేటాయించాలని పీజీ వైద్య విద్యార్థులు శనివారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్రతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తక్షణం మౌలిక వసతులు కల్పించకపోతే విధులు బహిష్కరిస్తామని లేఖ అందించినట్లు తెలుస్తోంది. ఇతర విభాగాల వైద్యులను కూడా ఐసోలేషన్ వార్డుల వద్ద విధులు కేటాయించాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అయితే పీపీఈ కిట్లు, ఎన్95 మాస్క్‌లకు ఎలాంటి ఇబ్బంది లేదని డా.నాగేంద్ర వారికి వివరించారు. 7500 పీపీఈ కిట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇదీ చదవండి: కరోనాకు డ్రగ్ రిలీజ్- ఒక్కో టాబ్లెట్ రూ.103