జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.... ముక్తీశ్వరస్వామికి అభిషేకాలు, పూజల్లో పాల్గొంటున్నారు. హన్మకొండ వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. సిద్ధేశ్వరాలయం, వేయిస్తంభాల గుడిలో భక్తుల ప్రత్యేక పూజలు జరుపుతుండగా... సాయంత్రం 6 గంటలకు రుద్రేశ్వరస్వామి కల్యాణోత్సవం జరగనుంది. శివరాత్రి జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. కీసరగుట్టలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు నిర్వహించారు. రుద్రస్వాహాకార హోమం, నంది వాహన సేవ చేశారు.
పోటెత్తిన భక్తులు
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తితిదే తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగుతోంది. పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు భక్తి శ్రద్ధలతో భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. దక్షిణ కాశీగా పిలువబడే అలంపూర్‌లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలంపూర్ బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ ఆలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. సంగమేశ్వరస్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
శివయ్య సేవలో ఎమ్మెల్యేలు, ఎంపీలు
మహాశివరాత్రి సందర్భంగా భద్రాచలంలోని గోదావరి తీరంలో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. నల్గొండ జిల్లా పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో రుద్రాభిషేకంతో పూజలు ప్రారంభమయ్యాయి. సోమేశ్వరస్వామికి పాలాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఇదీ చదవండి: మహాశివరాత్రి ఉపవాస దీక్ష ఎలా ఆచరించాలి?