బస్ స్టాప్, రైల్వేస్టేషన్లు, కళాశాలలతో పాటు ఆన్‌లైన్‌లో(ONLINE) మహిళలు, యువతులను వేధించే వారిపై షీ బృందాల(SHE TEAMS) పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. పోకిరీలు, ఆకతాయిలపై కొరడా ఝులిపిస్తున్నారు. బాల్య వివాహాలనూ అడ్డుకుంటున్నారు. జులైలో మహిళల వేధింపులకు సంబంధించి 157 ఫిర్యాదులు అందగా... 75 మంది ఆకతాయిలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. డెకాయి ఆపరేషన్ల ద్వారా 143 మంది పోకిరీలను పట్టుకున్నారు. రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు.
ప్రేమ పేరుతో మోసం
మేడ్చల్ జిల్లా సురారం కాలనీ ప్రాంతంలో నివసించే వంశీ అనే యువకుడు ప్రేమ(LOVE) పేరిట మాయమాటలు చెప్పి యువతిని నమ్మించి మోసం చేశాడని పోలీసులు తెలిపారు. యువతికి తెలియకుండా ఆమె అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో(SOCIAL MEDIA) పోస్టు చేస్తానంటూ యువతిని బెదిరించాడని పేర్కొన్నారు. వివాహం చేసుకోవాలని యువతి కోరగా... అందుకు అతను నిరాకరించాడని వెల్లడించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా... అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
'పెళ్లి చేసుకోకపోతే పోస్ట్ చేస్తా'
మరో కేసులో శంషాబాద్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని... నర్సింహ అనే ఆచార్యుడి వద్దకు ట్యూషన్‌కు వెళ్లేదని పోలీసులు తెలిపారు. ఎవరూ లేని సమయంలో ఆమె ఇంట్లో ప్రవేశించి... ఆమె అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు నర్సింహ చిత్రీకరించారని పేర్కొన్నారు. తనను వివాహం చేసుకోవాలని... లేకుంటే తాను తీసిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించారని చెప్పారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
ఫిర్యాదు ఇలా
పోకిరీలు, ఆకతాయిలు వేధిస్తే వాట్సప్ నంబర్ 9490617444, డయల్ 100, లేదా sheteam.cyberabad@gmail.com, twitter.@sheteamcyb ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు.
ఇదీ చదవండి: Government hospitals: పేదల ఆస్పత్రుల్లో అధ్వాన పరిస్థితులు.. ఇవిగో సాక్ష్యాలు