Sharmila letter to opposition parties: రాష్ట్రంలో నిరుద్యోగులకు మద్దతుగా పోరాటాన్ని ముమ్మరం చేసినట్లు తెలిపిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో అన్ని పక్షాల్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామంటూ ఇప్పటికే పలువురు పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె.. నిరుద్యోగుల పక్షాన పోరాటానికి కలిసి రావాలంటూ వివిధ పార్టీలకు లేఖలు రాశారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, మందకృష్ణ మాదిగ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావులకు షర్మిల లేఖలు రాశారు.
కీలకమైన పార్టీలకు ముఖ్య ప్రతినిధులుగా ప్రజా సమస్యలపై పోరాడుతూ.. మీరు చేసే పోరాటాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఆ లేఖలో వివరించారు. ఉమ్మడి కార్యాచరణ రూపొందించి నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని వివరించారు. తెలంగాణ భవిత, యువత కోసం కలిసి నడుద్దాం, నిలిచి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి నిరుద్యోగుల కోసం పోరాటం చేసే సమయం ఆసన్నమైందని షర్మిల పేర్కొన్నారు.
షర్మిల చేసిన ప్రతిపాదనలపై బీజేపీ ఆచితూచి స్పందించింది. నిరుద్యోగుల సమస్య సహా ఏ పోరాటానికైనా కలిసి పని చేసేందుకు సిద్ధమన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కాంగ్రెస్ ఉంటే రాలేమని స్పష్టం చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్న బండి సంజయ్.. ఆలాంటి సమయంలో కాంగ్రెస్‌తో కలిసి ఎలా పని చేస్తామని ప్రశ్నించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహరంలో వైఎస్ షర్మిలతో కలిసి వెళ్లవద్దని నిర్ణయించినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కాకుండా తాము చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఎవరు పాల్గొన్నా అభ్యంతరం లేదని వెల్లడించారు. పేపర్ లీకేజీలో బీజేపీ ద్వంద్వ విధానాలు అనుసరిస్తోందన్న రేవంత్.. ఆ విషయంపై కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు మద్ధతుగా పేపర్ లీక్ అంశంపై వైఎస్ షర్మిల రాసిన లేఖలపై మిగతా పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
ఇవీ చదవండి: