శంషాబాద్‌లో యువ పశు వైద్యురాలి హత్యకేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఘటన జరిగిన 48 గంటల్లోపే నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు మొబైల్ ఫోన్ కీలక ఆధారంగా మారింది. 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు వైద్యురాలు టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని పార్కింగ్ చేయడాన్ని నలుగురు నిందితులు చూశారు. ఆ సమయంలో వారంతా మద్యం సేవిస్తున్నారు. రాత్రి 9.18 గంటలకు బాధితురాలు టోల్ ప్లాజా వద్దకు వచ్చింది. ఆ సమయంలో మహ్మద్ ఆరిఫ్ అక్కడికి వచ్చి సహాయం చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఆమె ఫోన్ నంబరు తీసుకున్నాడు. వారిని నమ్మి వాహనం ఇచ్చిన యువతి.. 15 నిమిషాల తర్వాత కూడా వారు రాకపోయే సరికి అనుమానం వచ్చి నిందింతుల్లో ఒకడైన ఆరిఫ్‌కి ఫోన్ చేసింది. దర్యాప్తులో ఇదే పోలీసులకు కీలక ఆధారమైంది.
యువతి మొబైల్ నుంచి చేసిన చివరి ఫోన్ కాల్ ఆధారంగా ఆరిఫ్ ఆచూకీని పోలీసులు గుర్తించగలిగారు. అతడిని అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటికొచ్చింది. యువతిపై రాత్రి 9.30 గంటల నుంచి 10.20 గంటల వరకు నలుగురు నిందితులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ముక్కు, నోరు మూసేయడంతో ఊపిరాడక ఆమె చనిపోయింది. బాధితురాలిని ప్యాంట్ లేకుండానే లారీ క్యాబిన్ లోకి ఎక్కించారు. లారీలోకి ఎక్కించి తరువాత కూడా కీచకులు మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం నిందితుడొకరు కిందకు వెళ్లి ప్యాంట్ తీసుకొచ్చాడు. షాద్‌నగర్ వంతెన కింద యువతిని దింపిన నిందితులు ఆమె బతికి ఉంటుందన్న అనుమానంతో పెట్రోల్ పోసి తగలబెట్టారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.