కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ ఆవరణలో కూల్చివేతకు గురైన ఆలయాలను, మసీదులను తిరిగి నిర్మించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మండలి మాజీ విపక్ష నేత షబ్బీర్ అలీ లేఖ రాశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది సరైన సమయం కాదనే తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇచ్చే పరిస్థితుల్లో లేకుంటే మధ్యంతర భృతి అయినా ఇవ్వాలన్నారు.
పెండింగ్ స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రులను మరింత బలోపేతం చేయాలని, పౌరసేవలను మెరుగుపరచాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో రూ.500 కోట్లు వ్యయం చేసి సచివాలయ భవనాల నిర్మాణం చేయడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. సచివాలయ నిర్మాణానికి సంబంధించి మీడియాలో చూడడం తప్ప తమకు ఏలాంటి సమాచారం లేదని, అధికారులకు తగిన ఆదేశాలిచ్చి సచివాలయ ప్రాంగణంలో చర్చి, గుడి నిర్మాణం జరిగేట్లు చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.