లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజారవాణ పూర్తిగా స్తంభించిపోయింది. ఆ తర్వాత సడలింపులతో కొంతవరకు సేవలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ, రైల్వే సేవలు, విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో రైళ్లకు మాత్రం కేంద్రం సడలింపులు ఇవ్వలేదు. ఫలితంగా దాదాపు 5 నెలల నుంచి మెట్రో రైళ్లు డిపోలకే పరిమితం అయ్యాయి. అన్‌లాక్-3లో సడలింపులు ఇస్తారని భావించినా అలా జరగలేదు. అన్‌లాక్-4లో మెట్రో రైళ్లకు అనుమతులు లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
5నెలలు... 250 కోట్లు నష్టం
కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిస్తే.... మెట్రో సేవలను నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సిబ్బంది సన్నద్ధం అవుతున్నారు. అన్ని స్టేషన్లు చెత్త, దుమ్ముతో నిండిపోగా..రెండు రోజులుగా శుభ్రం చేస్తున్నారు. మెట్రో సంబంధిత కార్యాలయాలు, సాంకేతిక పరమైన అంశాలను అధికారులు పరీక్షిస్తున్నారు. ప్రయాణికులు సేవలకు దూరం కావడం వల్ల హైదరాబాద్ మెట్రో 5 నెలల్లో 250 కోట్ల రూపాయల మేర ఆదాయం కోల్పోయింది.
పూర్వ వైభవం వచ్చేనా?
ప్రస్తుతం మెట్రో అందుబాటులోకి వచ్చినా నగరవాసులు ఏ మేరకు ఆదరిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది సొంత వాహనాల్లో ప్రయాణిందుకే మొగ్గుచుపుతున్నారు. కరోనాతో ప్రజా రవాణ వైపు ఎవరూ చూడటంలేదు. మెట్రోను ఎక్కుగా ఆశ్రయించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో చాలామంది ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నారు. మరికొన్నాళ్లు ఇళ్ల నుంచే పనిచేయాలని ఐటీ కంపెనీలు సైతం నిర్ణయించాయి. ప్రస్తుతం మెట్రో ప్రారంభమైనా ఎంతమంది ప్రయాణం చేస్తారనేదే ప్రశ్నార్థకంగా మారింది.
రాష్ట్రాలదే తుది నిర్ణయం
నగరంలో ఇప్పటికి సిటీ బస్సులు నడవడంలేదు. ఫలితంగా కొంత వరకు జనం మెట్రోను ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ మెట్రోకు కేంద్రం సడలింపులు ఇచ్చినా.. వైరస్ తీవ్రతను బట్టి తుది నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం కల్పించే అవకాశం కనిపిస్తోంది. మెట్రోకు అనుమతి లభిస్తే భౌతిక దూరం పాటింపు.. సీట్ల సర్ధుబాటు ఏలా ఉంటుందనేది తేలాల్సి ఉంది.
ఇదీ చూడండి: 'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే'