మున్సిపల్ ఎన్నికల్లో తెరాస వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాబోయే సహకార సంఘాల ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే అంశాలపై జూబ్లీహిల్స్‌లోని ఉత్తమ్‌కుమార్ రెడ్డి నివాసంలో పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు.
సమావేశానికి మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్సులు వంశీచందర్ రెడ్డి, చిన్నారెడ్డిలు, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ తదితరులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, త్వరలో జరగబోతున్న సహకార సంఘాల ఎన్నికలే ప్రధానాంశాలుగా సమావేశంలో చర్చించారు.
కాంగ్రెస్ పార్టీ గెలిచిన పురపాలక సంఘాలను అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. చాలా చోట్ల అభ్యర్థులను భయపెట్టడం... ప్రలోభ పెట్టడం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రైతుబంధు అమలు కాలేదని, రుణమాఫీ లేదని, ఏంఎస్‌పీ లేదని ఆరోపించారు. సహకార ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలని అనే అంశంపై సీనియర్ నేతలతో చర్చించినట్లు వివరించారు.