Marri Shasidhar Reddy joined BJP: కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరారు. దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సోనోవాల్, కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో ఆయన కమలదళంలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత శర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ... ప్రజలంతా భాజపా వైపు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటంలేదని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ అవినీతిపై పోరాడటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి పట్ల దేశమంతా సానుకూలంగా ఉందని వెల్లడించారు. అందుకే బీజేపీలో చేరినట్లు స్పష్టం చేశారు. భాజపాలో సామాన్య కార్యకర్తగా నిబద్దతతో పనిచేస్తానని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసిన తెరాస సర్కార్ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆక్షేపించారు. తెరాస ఎదుర్కొనే శక్తి ఒక్క భాజపాకు మాత్రమే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పునరుద్ఘాటించారు. భాజపాను ఒంటరిగా ఢీకొట్టలేని తెరాస కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు.
ఇటీవల మర్రి శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి టీపీసీసీ సస్పెండ్ చేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసింది. దిల్లీలో అమిత్ షాను కలిసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. దీనితో మర్రి కూడా పార్టీకి రాజీనామా చేసి... కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. తాజాగా ఈరోజు కమలం గూటికి చేరారు.
ఇవీ చూడండి: