Self Medication: పాము కరిచినప్పుడు విరుగుడుగా పాము విషాన్నే ఇస్తారనేది చాలా మందికి తెలిసిన విషయమే. అదే విషం లేని సందర్భాల్లో పాము రకాన్ని తప్పుగా అంచనా వేసిన సందర్భాల్లో చేసే వైద్యం మనిషి ప్రాణాలకే ప్రమాదం. ప్రాణాలు దక్కించుకునేందుకు చేసే ప్రయత్నమే ప్రాణాలు తీస్తుంది. సరిగా ఇలానే కొవిడ్ నేపథ్యంలో విరివిగా వినియోగిస్తున్న ఔషధాలు తీవ్ర అనర్థాలకు కారణమవుతున్నాయి. ముందు జాగ్రత్త కోసం అంటూ కొందరు, వాతావరణం మార్పుల వల్ల వచ్చే సహజ అనారోగ్యానికి కొవిడ్ అని భయపడి మరికొందరు అందుబాటులో ఉన్న మందుల్ని విచ్చల విడిగా వాడేస్తున్నారు. ఈ విధానం మంచిది కాదని.. తెలిసీ తెలియక చేసుకునే సొంత వైద్యం ప్రాణాలకు ముప్పు అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
లేనిపోని రోగాల బారిన పడుతున్నారు..
Covid medicines: వాస్తవానికి కొవిడ్ వైరస్‌ను నిర్మూలించేందుకు ఎలాంటి మందులు లేవు. ఇప్పటి వరకు తయారు చేయలేదు కూడా. ప్రస్తుతానికి కొవిడ్ టీకాలు మాత్రమే శాస్త్రీయంగా కొవిడ్ వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నాయి. మిగతా వాటితో అసలు కొవిడ్ వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ టీకాలు అందుబాటులో లేనప్పుడు, టీకా వినియోగంలోకి వచ్చాక కొన్ని మందుల్ని తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగిస్తున్నారు. అవన్నీ ఆయా సందర్భాలకు అనుగుణంగా వైద్యులు తీసుకున్న నిర్ణయాలు. కొవిడ్ వైరస్.. శ్వాసకోశ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుండడం, అందుబాటులో ప్రత్యేక మందులు లేకపోవడంతో.. ఆయా లక్షణాలను బట్టి, ఎప్పటి నుంచో ఉన్న ఔషధాల్నే వాడుతున్నారు వైద్యులు. మొదటి వేవ్ సమయంలో ఎక్కువగా హైడ్రాక్సీక్లోరోక్విన్, మీజిల్స్-రూబెల్లా వ్యాక్సిన్, ఐవర్‌మెక్టిన్, లొపినావీర్-50, రిటోనావీర్-200 వంటి మందుల్ని వినియోగించారు. వీటిలో ఏ ఔషధం ఎంత వరకు పని చేస్తుందో... వైద్యులకూ కచ్చితంగా తెలియదు. కాబట్టి ఇవన్నీ ప్రాణాలు కాపాడేందుకు చేస్తున్న తాత్కాలిక ప్రయత్నాలే అన్నది స్పష్టం. ఈ విషయాన్ని గుర్తించని ప్రజలు ఇష్టారీతిన మందుల్ని వినియోగిస్తున్నా రు. ఏ సందర్భాల్లో, ఏ మందును ఎంత మోతాదులో వినియోగించాలో కూడా తెలియకుండా మందులు వేసుకుంటున్నారు. ఫలితంగానే లేనిపోని రోగాల బారినపడుతున్నారు.
ఇతరులకు సూచించిన ప్రిస్క్రప్షన్ ఆధారంగా..
కొవిడ్ వ్యాప్తిలోకి వచ్చాక ఫలానా మందులు బాగా పనిచేస్తున్నాయి. వీటితో ప్రాణాలు రక్షించుకోండి అంటూ... సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. వాటిలో వాస్తవం ఎంత, అవి పోస్ట్ చేసిన వారికున్న అనుభవం, అర్హత వంటి విషయాల్ని పట్టించుకోకుండా చాలామంది ఆ సూచనలు, సలహాల్ని పాటించేస్తున్నారు. మరికొందరు.. స్నేహితులు, బంధువులకు సూచించిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందుల్ని వినియోగిస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి?.. ఏ మందులైతే మంచిదో... వైద్యులు నిర్ధారించి సూచించిన జాబితా అది. అదే ప్రిస్కిృప్షన్ మిగతా వారికి పనికి రాదు. దాన్ని అనుసరించడాన్ని సొంత వైద్యమే అంటున్నారు వైద్యులు. ఇంకొందరైతే... సాధారణ దగ్గు, జలుబు ఉన్నా భయంతో మెడికల్ షాపులకు వెళ్లి తెలిసిన మందులు తెచ్చుకుంటున్నారు. వాడాల్సిన రోజులకు మించి వాడుతూ ఇబ్బందుల పాలవుతున్నారు.
సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మి..
covid-19 social media posts: సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మి చాలామంది ఆస్పిరిన్, ఎకోస్పైన్‌లు వాడేస్తున్నారు. ఇక కొంతమంది విటమిన్ సీ, డీ, జింక్ మందులను రోజు వారీ మందుల మాదిరిగా వేసుకుంటున్నారు. వాటితో పాటే చిట్కాల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతో కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. వాటిలో ముక్కులో 2 చుక్కల నిమ్మ రసం వేసు కుంటే చాలు... శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయనే వార్త విస్తృతంగా చక్కర్లు కొట్టింది. కానీ ఆ విషయాన్ని ఇంత వరకు శాస్త్రీయంగా ఎవరూ ధ్రువీకరించలేదు. మరికొందరు నెబులైజర్ వాడాలంటూ సూచించగా, కర్పూరం, వాము, నీలగిరి తైలం మిశ్రమం కొవిడ్ రోగుల్లో ఆక్సిజన్ లెవెల్ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుందనే వార్తలూ వచ్చాయి. కానీ, లేపనంలా ఉపయోగించే కర్పూరం శరీరంలోకి తీసుకోవడం ప్రాణాంతకం కావచ్చని... కర్పూరం ఆవిరి శరీరం లోపల విషపూరితం అవుతుందని... అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెచ్చరించింది. వీటితో పాటే ఎన్నో సంఘటనలూ వెలుగు చూశాయి.
పరిమితికి మించి ఔషధాల వినియోగమే కారణం..
Black Fungus Virus: రెండో వేవ్ ముగింపు దశలో బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా వెలుగు చూశాయి. కొవిడ్ రోగుల్లో చాలా మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇందుకు పరిమితికి మించిన ఔషధాల వినియోగమే కారణమని తేల్చారు పరిశోధకులు. మామూలు సమయాల్లోనూ బ్లాక్ ఫంగస్ వైరస్ ఉనికిలో ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువగా ఔషధాల్ని వినియోగించి, మానవ శరీర ఆరోగ్య రక్షణ వ్యవస్థను బలహీన పరుస్తామో అప్పుడు ఈ వైరస్ బలపడి, ఉనికి చాటుకుంటుంది. రెండో వేవ్‌లో ఆసుపత్రులకు వెళ్లేందుకు భయపడిన చాలా మంది కరోనా సోకినా ఇంట్లో ఐసోలేషన్‌లోనే ఉండిపోయారు. ఆ సమయంలో వైద్యుల పర్యవేక్షణ లేకుండానే ఇష్టానుసారం స్టెరాయిడ్లు వాడారు. ఈ ఫంగస్ లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చిన మొత్తం రోగుల్లో 20 నుంచి 25 శాతం మంది సొంత వైద్యాన్ని ఆశ్రయించిన వాళ్లేనని వైద్యులు తెలుపుతున్నారు.
సొంత వైద్యం.. ప్రాణసంకటం..
Dangers of Self medication: సొంత వైద్యం కారణంగా మధుమేహంతో మరణిస్తున్న వారూ ఎక్కువే. స్టెరాయిడ్లు అధికంగా తీసుకోవడంతో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. హోం ఐసొలేషన్‌లో ఉన్న వేలాది మంది 3-4 రోజులు జ్వరం వస్తే తమంత తాముగా స్టెరాయిడ్లు వాడుతున్నారు. ఇలా 2-3 వారాలు అధిక మోతాదులో వాడి, తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నట్లు వైద్యుల పరిశీలనలో తేలింది. దీంతో మధుమేహం పెరిగి ఇతరత్రా అవయవాలు సరిగా పనిచేయని పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని చోట్ల సాధారణ జ్వరం వస్తే ఫ్లూగా భావించి స్టెరాయిడ్లు తీసుకున్నారు. అవి దుష్ప్రభావాలు చూపడంతో ఐసీయూలో చేరాల్సిన పరిస్థితులూ తలెత్తాయి.
నిబంధనలను పెడచెవిన పెడుతున్నారు..
self medication is dangerous: కొవిడ్ చికిత్సలో భాగంగా నోటి ద్వారా తీసుకునే యాంటీవైరల్ ఔషధం మోల్నుపిరవిర్. ఈ మాత్రలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. భారత ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) దీన్ని అత్యవసర పరిస్థితుల్లో, వైద్యుల సిఫారసుతో మాత్రమే వినియోగించాల్సిందిగా సూచించింది. ఆక్సిజన్ స్థాయులు 93 కన్నా తక్కువ ఉన్నవారికి, కొవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగే ప్రమాదం ఉన్నవారికి, ఆస్పత్రిపాలయ్యే, మరణించే ముప్పున్నవారికి మాత్రమే ఇవ్వాలని షరతులు విధించింది. 18 ఏళ్లలోపు వాళ్లు, బాలింతలు ఈ మాత్రల్ని వినియోగించకూడదు. ఇలా ఎన్నో నిబంధనల్ని విధించినా పెడచెవిన పెడుతున్న జనం, ప్రిస్కిృప్షన్ లేకుండానే కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. డెల్టా వేవ్‌లో రెమ్‌డెసివిర్‌కు కొరత ఏర్పడినట్లే... మూడో వేవ్ వస్తే ఈ మాత్రలు దొరకవన్న భయంతో ఇలా చేస్తున్నారని తెలుస్తోంది.
వైద్యుల సూచనల మేరకే వాడాలి..
medicine usage: ఇలా మితిమీరిన మందుల వినియోగం వల్ల దీర్ఘకాలిక రోగాలు వస్తాయని చెబుతున్న వైద్యులు.. వాటిలో ముఖ్యమైంది మ్యూటాజెనెసిటీ అంటే జన్యువుల్లో శాశ్వతంగా మార్పులు. ఆరోగ్యకరమైన జన్యువులు పాడై.. తర్వాతి తరాల్లోని వారికి ఇప్పటి రోగాలను వారసత్వంగా అందించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలానే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు సోకేందుకు అవకాశం ఉందంటున్నారు. అందుకే ఔషధాల్ని సొంతంగా వాడడం మానుకోవాలని, వైద్యుల సూచనలు, సలహాల మేరకే మందులు వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వైరస్ సోకినప్పుడే వాడాలి..
Anti Viral drugs: వైరస్ సోకినప్పుడు మాత్రమే యాంటీ వైరల్ డ్రగ్స్‌ని వాడాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అజిత్రోమైసిన్ వంటి యాంటి బయాటిక్ మందులు ఎక్కువగా వాడితే గుండెపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతే కాకుండా యాంటిబయాటిక్ మందులు ఎక్కువగా వాడటం ద్వారా శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి, జబ్బు చేసినప్పుడు ఆ మందులు పని చేయకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు.
ఇదీ చదవండి: