Secunderabad Fire Accident Two Dead Bodies Identified: ఉవ్వెత్తున మంటలతో సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని దక్కన్ స్పోర్ట్స్ నిట్‌వేర్ మాల్ అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించగా.. గుజరాత్‌కు చెందిన మరో ముగ్గురు కూలీలు జునైద్, వసీం, జహీర్ ఆచూకీ గల్లంతైంది. కూలీల సెల్‌ఫోన్ లోకేషన్ మంటలు చెలరేగిన భవనంలోనే చూపిస్తుండటంతో వారు సజీవ దహనమయ్యే అవకాశముందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. దీంతో నిన్న ఉదయం నుంచి వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
22 అగ్నిమాపక శకటాలతో మంటలు పూర్తిగా ఆర్పివేసినప్పటికీ భవనంలో వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ సిబ్బంది మాల్ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో డ్రోన్ కెమెరాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనం రెండో అంతస్తులో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. భవనం లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ తెలిపారు. డ్రోన్ కెమెరా ద్వారా సమాచార సేకరణకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భవనం లోపల ఇంకా వేడిగానే ఉందని, ఇప్పటికీ భవనంలోనికి వెళ్లలేకపోతున్నామని ఆయన తెలిపారు.
మొదట లభించని ఆచూకీ.. చివరికీ డ్రోన్ కంటికి: భవనం లోపల వారిని కాపాడేందుకు సిబ్బంది ఆ దట్టమైన పొగలో భవనం మధ్యలోకి వెళ్లి గాలించారు. వీరు ఆక్సిజన్ సిలిండర్లు, ప్రత్యేక మాస్కులు ధరించి భవనం లోపలికి ప్రవేశించారు. ఆరంస్తుల భవనం మొత్తం అణువణువు వెతికారు. ధైర్యంగా అద్దాలను పగలకొట్టి క్షుణ్ణంగా గాలించిన ఎవరి ఆచూకీ లభించలేదు. ఈ దట్టమైన పొగలో సహాయ చర్యల్లో పాల్గొన్న జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారి ధనుంజయ్ రెడ్డి.. సిబ్బంది నర్సింగ్‌రావు.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరిని అధికారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతున్నారు. అయితే టైర్లు, రెక్సీన్ సామగ్రి, రసాయనాలు, రంగులు వంటివి.. అధిక శాతం భవనంలో నిల్వ చేయడం వలనే మంటలు వేగంగా తీవ్రంగా వ్యాపించాయని.. అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే అధికారులు ఆ ముగ్గురు వ్యక్తుల ఆచూకీని గుర్తించడానికి డ్రోన్ కెమెరాను రంగంలోకి దించారు. అయితే రెండో అంతస్తులో రెండు మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది.. దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇవీ చదవండి: