Kantivelugu hundred days : కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది. జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వం రెండో దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో ప్రారంభించింది. సరిగ్గా నేటికి వంద రోజులు పూర్తి చేసుకోవడంతో మంత్రులు సచివాలయంలో సంబురాలు నిర్వహించారు. హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్ కేక్ కట్ చేశారు. ఆశావర్కర్లకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటి వరకు వంద పనిదినాల్లో కోటీ 61 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు. అందులో 40 లక్షలా 59 వేల మందికి దృష్టి లోపం ఉన్నట్టు గుర్తించారు. అందులో 22 లక్షలా 51 వేల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా.. 18 లక్షలా ఎనిమిది వేల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేశారు. మొత్తం 33 జిల్లాలకు గాను ఇప్పటి వరకు 24 జిల్లాల్లో స్క్రీనింగ్ సంపూర్ణమైంది.
కంటి వెలుగు విజయవంతంగా నిర్వహించేందుకు పాలు పంచుకున్న వైద్య, ఆరోగ్యశాఖ సహా సహకరించిన ఇతర శాఖలు, ప్రజా ప్రతినిధులకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అలోచనతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘‘కంటి వెలుగు’ కార్యక్రమంలో లక్ష్యానికి మించి కంటి పరీక్షలు చేసినట్లు చెప్పారు. నివారింపదగిన, అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మందికి కంటి వెలుగు ప్రసాదించిందని మంత్రి అన్నారు.
ఎవరూ అడగక ముందే పథకాన్ని ప్రారంభించి, మానవత్వాన్ని చాటుకున్న గొప్ప మనసు సీఎం కేసీఆర్‌ది అని తెలిపారు. గ్రామాలకు వైద్య సిబ్బంది వచ్చి, ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెక్కడా లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. మిగిలిన తొమ్మిది జిల్లాల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
నలుగురు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా.. అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమంను ఖమ్మం జిల్లాలో ప్రారంభించారు. ఖమ్మంలో సీఎం కేసీఆర్ సహా... కేరళ, పంజాబ్, దిల్లీ ముఖ్యమంత్రుల చేతుల మీదుగా కంటి వెలుగును ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 1500 వైద్య బృందాలను సిద్ధం చేశారు. వీటికి తోడు మరో 5 శాతం అదనంగా కంటి వెలుగు బృందాలు నిత్యం అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి బృందంలో ఒక వైద్య అధికారి, 8 మంది సిబ్బంది ఉండనున్నారు. వారిలో ఒక అప్తోమెట్రిస్ట్, సూపర్‌వైజర్, ఇద్దరు ఎఎన్ఎమ్లు, ముగ్గురు ఆశా వర్కర్లు, ఒక కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు.
ఇవీ చదవండి: