Second Day Telangana Legislative Assembly Sessions : ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai) చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ సాగింది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తీర్మానం ప్రతిపాదించగా, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బలపర్చారు. అనంతరం మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్(KTR) గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడకగా సత్య దూరంగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వం అప్పుల గురించే చెబుతున్నారన్నారు. కేసీఆర్ సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదని ప్రశ్నించారు. అప్పుల పేరు చెప్పి హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
"అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు లక్ష కోట్ల ఆస్తిని సృష్టించి మీకు ఇచ్చాము. అందుకే సభను సవ్యంగా నడపండి. కాంగ్రెస్ పార్టీ వదిలిన అప్పులు రూ.11 వేల కోట్లను డిస్కంలో తీసుకోవడమే కాకుండా రూ.9 వేల కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. విద్యుత్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానానికి దారి తీస్తోంది. 200 యూనిట్ల వరకు కరెంటును ఉచితంగా ఇస్తామని చెప్పారు ఆ మాట నిలబెట్టుకోవాలి." - కె. తారక రామారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ 'విరాళాల' బాట- లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం- పార్టీ ఆవిర్భావం రోజునే!
కాంగ్రెస్ హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో గవర్నర్ చెప్పలేదు : ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై వివరించిన గవర్నర్ తమిళిసై, ఎప్పటినుంచి వాటిని అమలు చేస్తారో చెప్పకపోవడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు సహకారం అందిస్తామని, హామీలను(Congress Guarantees) విస్మరిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
"గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చదివినట్లే ఉంది. హామీల అమలు, కార్యచరణపై ఏవిధంగా అమలు చేస్తారో చెప్పకపోవడం బాధాకరంగా ఉంది. ఎంతసేపు ఆరు గ్యారెంటీల గురించే మాట్లాడుతున్నారు కానీ, మిగిలిన 412 హామీల సంగతి చెప్పడం లేదు. ఈ సభలోనే అందుకు సంబంధించిన చట్టబద్ధత తీసుకువస్తే బాగుంటుంది. కేసీఆర్ చేసిన అప్పుల గురించి మాట్లాడారు, ఆ అప్పులను చూసి హామీలను వదిలి పెట్టేద్దామని చూస్తున్నారా." - ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే
Akbaruddin Owaisi Speech in Assembly : మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని ఎంఐఎం(MIM) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను కూడా పెట్టాలని కోరారు. ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలన్న ఆయన, గెలిచిన పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పనిచేయాలని కోరారు. పాతబస్తీ(Old City)లో అభివృద్ధికి సీఎం సమీక్ష చేయాలని అక్బరుద్దీన్ విజ్ఞప్తి చేశారు.
"మేం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని విమర్శించాం. కొన్ని సమర్ధించాం. ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారు తప్పులు చేస్తే వ్యతిరేకించాం. మంచి పనులు చేసినప్పుడు ప్రశంసించాం. అదే విధానాన్ని ఇప్పుడు అనుసరిస్తాం. ఎంఐఎంతో ఎలాంటి పొత్తులేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి సంతోషించాం. మేం ఒంటరిగానే ఉంటాం. మా పోరాటాన్ని కొనసాగిస్తాం." - అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే
ప్రభుత్వం ఏర్పడిన రెండ్రోజుల్లోనే రెండు హామీలు నెరవేర్చారన్న సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(CPI MLA Kunamneni Sambasiva rao), హామీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నిరోజులు ఉంటుందో చూస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం మంచిదికాదని వ్యాఖ్యానించారు. పాత ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందో కాంగ్రెస్ బేరీజు వేసుకొని ముందుకెళ్లాలని కూనంనేని సూచించారు.
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది : సీఎం రేవంత్ రెడ్డి
'సీఎం రేవంత్ రెడ్డికి పంటల బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదు'