IT Raids at minister mallareddy properties : హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాలుగు వందలకుపైగా అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు కొనసాగిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి కొడుకులు, అల్లుడు, ఇతర బంధువులు, ఆయనకు చెందిన ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాల, ఫార్మా కళాశాల, ఆస్పత్రితోపాటు ఆయా సంస్థల కార్యాలయాలు, డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లపైనా దాడులు కొనసాగుతున్నాయి.
కొంపల్లి, సుచిత్ర, దూలపల్లి, బోయనపల్లి, సూరారం, గండి మైసమ్మ తదితర ప్రాంతాలల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డికి సంబంధించిన స్నేహితుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు పన్ను చెల్లించని నగదు చలామణి అవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించి కేసు నమోదు చేసి.. సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించి ఎంత ఆదాయం వస్తోంది.. ఎంత మొత్తానికి ఆదాయ పన్ను చెల్లించాలి.. ఇప్పుడు చెల్లిస్తున్నది ఎంత తదితర వివరాలను నిగ్గు తేల్చనున్నారు.
ఇప్పటి వరకు ఐటీ వర్గాల సమాచారం మేరకు నగదు, బంగారం, కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో నాలుగు కోట్ల రూపాయలతోపాటు ఇతర ప్రాంతాలల్లో కూడా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఇవాళ, రేపు కూడా సోదాలు కొనసాగేందుకు అవకాశం ఉందని చెబుతున్నఐటీ వర్గాలు ఈ సాయంత్రానికి సోదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: