పురపాలక ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు కోసం బ్యాంకు ఖాతాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు సడలించింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం పురపోరులో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చు కోసం నామినేషన్ దాఖలు చేసే కనీసం ముందు రోజు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాల్సి ఉంది. అదే ఖాతా ద్వారా ఎన్నికల ఖర్చు చేయాల్సి ఉంది.
కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు సమయం పడుతుందని... నామినేషన్ల దాఖలుకు కొంత సమయం మాత్రమే ఉన్నందున కొత్తగా బ్యాంకు ఖాతాలు తీయడం సాధ్యం కాదని పలువురు ఎస్ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలించింది. అభ్యర్థులు కొత్తగా బ్యాంకు ఖాతాను తెరవకుండా ఇప్పటికే ఉన్న ఖాతాలను కూడా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది.
అయితే సదరు అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి అండర్ టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండర్ టేకింగ్ ఇచ్చి ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాను ఉపయోగించుకోవచ్చని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇవీ చూడండి: పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీలకు గుర్తుల కేటాయింపు..