కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ పార్థసారథి దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్నారు. పలు జిల్లాల్లో జరగనున్న ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఖాళీ అయిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ముందస్తు ఏర్పాట్లు చేయండి..
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా... సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ... రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఈనెల 12లోపు శిక్షణ పూర్తి చేయాలని పార్థసారథి ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున అవసరమైన ఏర్పాట్లను... ముందస్తుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. అవసరమైన సిబ్బంది, సామాగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్ పేపర్ ముద్రణ సహా... సిరా తదితర అంశాలను సంబంధిత అధికారులతో పురపాలకశాఖ సంచాలకులు పర్యవేక్షిస్తారని చెప్పారు.
భారత ఎన్నికల సంఘం జనవరి 15న ప్రచురించిన ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీ తుది ఓటరు జాబితాలను 11వ తేదీన ప్రచురించాలన్నారు. 14వ తేదీన పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురించాలని తెలిపారు. ఆయా ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఎన్నికలు జరిగే పట్టణాల్లో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. ఎన్నికల వేళ కొవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఏప్రిల్ 12న వార్డుల వారీ తుది ఓట్లర జాబితా: ఎస్ఈసీ