ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 10న ఫలితాలు విడుదల చేస్తారు. ఈనెల 9న అవసరమైన చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తారు. ఏపీ వ్యాప్తంగా.. ఎన్నికల నిర్వహణ కోసం.. 33,663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. 2 కోట్ల 82 లక్షల 15 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
గత ఏడాది 660 జడ్పీటీసీలకు గాను 652 స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో.. 126 జడ్పీటీసీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 526 స్థానాలకు 8న ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,092 మంది అభ్యర్థులు ఉన్నారు.
ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. విభజన, కోర్టు కేసుల వల్ల 354 స్థానాల్లో ప్రక్రియ జరగడం లేదు. 2,371 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 7,322 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ ఎన్నికల బరిలో 19,002 మంది అభ్యర్థులు నిలిచారు.
నిలిచిన చోటు నుంచే...
వాస్తవానికి.. గత ఏడాది మార్చి 7న ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత.. కరోనా వ్యాప్తి దృష్ట్యా గతంలో ఎన్నికలను ఏపీ ఎస్‌ఈసీ వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి తగ్గాక.. ప్రక్రియ ఆగినచోట నుంచి మళ్లీ ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో.. ప్రక్రియ నిలిచిన చోటు నుంచే తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలిపిన ఎస్‌ఈసీ.. ఏకగ్రీవాలు మినహా మిగిలిన చోట్ల జరగనున్న ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది.
ఇదీ చదవండి: 'వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడే'