ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పదవీ విరమణ చేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా తనకు ప్రజలు, మీడియా నుంచి అపూర్వ సహకారం అందిందని వెల్లడించారు. రీపోలింగ్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని ఎస్‌ఈసీ వివరించారు. ఏపీ ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం లభించినట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. కొంతమంది అనాగరిక చర్యలు వ్యవస్థపై ప్రభావం చూపాయన్నారు. సిబ్బంది మూకుమ్మడి సెలవుపై పంపించే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నామని చెప్పారు.
గుంటూరులో దరఖాస్తు..
తెలంగాణలో ఉన్న తన ఓటు హక్కుని తీసేసి గుంటూరులో దరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. తన హక్కును సాధించుకునేందుకు న్యాయ పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. తమ బాధ్యతల నిర్వహణలో హైకోర్టు సంపూర్ణ సహకారం అందించిందన్నారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కమిషనర్ నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మంచి పద్ధతి అమలులో ఉందని ఈ సందర్భంగా ఎస్‌ఈసీ తెలిపారు.
'గవర్నర్‌కు అందిస్తా'
అధికారిక సమాచారాన్ని నివేదిక రూపంలో క్రోడీకరించి ఏపీ గవర్నర్‌కు అందిస్తానని తెలిపారు. అధికారిక సమాచారాన్ని తానెప్పుడూ లీక్ చేయలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయాలనేదే తన అభిప్రాయమని కమిషనర్ చెప్పారు.