రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే గాంధీ ఆసుపత్రిని కేవలం ఆ రోగుల కోసమే కేటాయించారు. గచ్బిబౌలిలో 1500 పడకలతో ‘టిమ్స్’ ఆసుపత్రినీ సిద్ధం చేశారు. సీజనల్ వ్యాధులు పెరిగితే ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. గతేడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్, స్వైన్‌ఫ్లూ వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరినవారి సంఖ్య వందలకు చేరింది. దీంతో పడకలు దొరకని పరిస్థితి.
మలేరియా.. వానాకాలంలో ఈ వ్యాధి పెరుగుతుంది. ఇందులో అత్యంత ప్రమాదకరమైన ప్లాస్మోడియం ఫాల్సీఫారం (పీఎఫ్) కేసులు ఏటా అధిక సంఖ్యలో నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. ఈ జ్వరానికి కారణమయ్యే ‘ప్లాస్మోడియం’ పరాన్నజీవి ఆడ అనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమ ఎక్కువ మురుగు నీటిలో పెరుగుతుంది. వర్షాలతో నగరంలో ఎక్కడ పడితే అక్కడ మురుగు నీళ్లు నిల్వ ఉంటాయి కాబట్టి ఇందులో మలేరియా కారక దోమలు వృద్ధి చెందే అవకాశం ఎక్కువ. మలేరియాలో రెండు రకాలు. ఇందులో ప్లాస్మోడియం వైవాక్స్ (పీవీ), ప్లాస్మోడియం పాల్సీఫారం (పీఎఫ్). పీఎఫ్ అత్యంత ప్రమాదకరం. ఏ మాత్రం అశ్రద్ధ చేసిన అది ప్రాణాలకే ముప్పు.
ప్రమాదకారి డెంగీ..
నగరంలో ఏటా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉంటే ప్రదేశాలు, తాగి పడేసే కొబ్బరి బొండాలు, టీ కప్పులు, కొబ్బరి చిప్పలు ఈ దోమలకు అనువుగా ఉంటున్నాయి. వీటిలో నీళ్లు చేరి డెంగీకి కారణమయ్యే ఈడిన్ ఈజిఫ్టై దోమ వృద్ధి చెందుతుంది. ఇది కుడితే హఠాత్తుగా జ్వరం, కళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు, వాంతులు, వికారం, రక్తంతో కూడిన మలవిసర్జన తదితర లక్షణాలు ఉంటాయి. కొందరిలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోయి షాక్ సిండ్రోమ్‌కు దారి తీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
వెంటాడే సాధారణ ఫ్లూ..
ఈ సీజన్‌లో ఫ్లూ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారిలో ఫ్లూ వెంటనే దాడి చేస్తుంది. ముక్కు కారటం, జలుబు, దగ్గు, ఆయాసం ప్రధాన లక్షణాలు. ఫ్లూ కూడా కరోనా లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. చేతి శుభ్రత లేకపోవడం, ఫ్లూ ఉన్న వ్యక్తి తుమ్మడం, దగ్గడం వల్ల ఇతరులకు సోకుతుంది. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచింది.
స్వైన్‌ఫ్లూ దాడి..
అక్టోబరు నుంచి మార్చి వరకు స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతుంటాయి. హెచ్1ఎన్1 వైరస్ దీనికి కారణం. కరోనా మాదిరిగానే ఇది కూడా శ్వాస కోశ వ్యవస్థపై దాడి చేస్తుంది. ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకుతుంది. వైరస్ ఉన్న వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వడంతోపాటు తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇవే జాగ్రత్తలు పాటించడం ద్వారా స్వైన్‌ఫ్లూ సోకుండా నివారించవచ్చు.
జాగ్రత్తలు పాటించకపోతే కష్టమే - డాక్టర్ ఎం.వి.రావు, సీనియర్ ఫిజీషియన్
- కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలే మున్ముందూ కొనసాగించాలి. మాస్క్ ధరించడం, చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం జీవనంలో భాగం కావాలి. గుంపుల్లో కలవకపోవడం మంచిది.
- వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలి.
- ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగడం మంచిది కాదు. బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తాగడం మంచిది. లేదంటే ఇంట్లో ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి.
జీహెచ్‌ఎంసీ, జలమండలి కీలకం..
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జీహెచ్‌ఎంసీ కీలక పాత్ర పోషించాలి. ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. లార్వా వృద్ధి లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. ప్రధాన రహదారులు, కాలనీలు, బస్తీల్లో చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలి. నాలాల్లో పూడిక తీయించాలి. మే నెలాఖరు నాటికే పనులు పూర్తి చేయాలి. వర్షం పడితే గోతుల్లో నీళ్లు చేరి అక్కడ దోమలు పెరిగే అవకాశం ఉంది. అందుకు రహదారులపై గుంతలు లేకుండా మరమ్మతులు చేయించాలి. ఫాగింగ్ యంత్రాలు సమకూర్చుకోవాలి. కలుషిత తాగునీరు సరఫరా లేకుండా జలమండలి కూడా కసరత్తు చేయాలి.
ఇదీ చూడండి: 'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'