ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే పది మంది కీలక సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ పూర్తి కాగా.. ఈనెల 26 నుంచి ఆగస్టు 13 వరకు 33 మంది సాక్షుల విచారణ చేపట్టేలా అనిశా ప్రత్యేక న్యాయస్థానం షెడ్యూలు రూపొందించింది.
కేసులో సుమారు 50 మందికి పైగా సాక్షులు ఉన్నందున.. విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలని అనిశా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్రావు కోరారు. వారంలో రెండు రోజులు మాత్రమే విచారణ జరపాలని.. రోజూ విచారణ చేపట్టడం వల్ల న్యాయవాదులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది.. కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పాక్షికంగానే ప్రత్యక్ష విచారణలు చేపట్టాలని హైకోర్టు పేర్కొన్నందున వారానికి ఒక్కసారే సాక్షుల విచారణ చేపట్టాలని సెబాస్టియన్ తరఫు న్యాయవాది కోరారు. కరోనా నుంచి కోలుకుంటున్నానని, రోజూ సాక్షుల విచారణ వల్ల ఇబ్బంది పడుతున్నానని ఉదయ్ సింహా తరఫు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులో ప్రజా ప్రతినిధులపై అభియోగాలు ఉన్నందున.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు వేగంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అనిశా కోర్టు స్పష్టం చేసింది. పాక్షిక ప్రత్యక్ష విచారణల్లో ఐదేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసిందని అనిశా కోర్టు పేర్కొంది. సాక్షుల విచారణ షెడ్యూలు రూపొందించి న్యాయవాదులకు ఇవ్వాలని గత నెలలోనే హైకోర్టు ఆదేశించిందని అనిశా న్యాయస్థానం గుర్తు చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈనెల 26 వరకు ఆగస్టు 13 వరకు 33 మంది సాక్షులను విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఆగస్టు 14 నుంచి 30 వరకు సెలవులో వెళ్లనున్నందున మిగతా సాక్షుల విచారణ సెప్టెంబరు 1 నుంచి చేపట్టనున్నట్లు అనిశా కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇదీచూడండి: CBN: అపెక్స్ కౌన్సిల్ సమావేెశం ఎందుకు ఏర్పాటు చేయలేదు?