రాష్ట్రంలో రాగల 2 రోజులపాటు ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్ర దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో.. ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సంచాలకులు పేర్కొన్నారు.
ఎడతెరపి లేకుండా..
వారం రోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు భారీ నష్టాన్నే మిగిల్చాయి. కుండపోతగా కురిసిన వానలకు వాగులు, వంకలు పొంగాయి. చెరువులు అలుగులు పారాయి. దీంతో గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ చిన్నారి గోడకూలి మృతి చెందగా.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఓ యువకుడు వాగులో గల్లంతయ్యాడు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సుమారు 350 కిలోమీటర్ల మేరు రహదారులు దెబ్బతిన్నట్లుగా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వరద దాటికి విద్యుత్ శాఖకు సైతం నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. వనపర్తి పట్టణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. సమీపంలోని తాళ్ళచెరువు వాగు.. పట్టణంలోని పలు కాలనీలకు ముంచెత్తింది.
భారీగా వరద..
కుండపోతగా కురుస్తున్న వర్షాలతో... కృష్ణ పరీవాహక ప్రాంతంలో నుంచి వరద భారీగా చేరుతోంది. శనివారం ఉదయం నుంచి జలాశయంలోకి 2.01 లక్ష క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 28 క్రస్ట్ గేట్ల ద్వారా 1.92 లక్షల క్యూసెక్కులు, జలవిద్యుత్పత్తి ద్వారా 21 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 2 లక్షల 62 వేల 390 క్యూసెక్కులు వస్తుండగా.. 2 లక్షల 17 వేల 826 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు వస్తోంది. 3లక్షల 77 వేల 594 క్యూసెక్కులు వస్తుండగా.. సాగర్ డ్యాం నుంచి 20 గేట్ల ద్వారా 3 లక్షల 40 వేల 344 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వ, ఎడమ కాల్వల విద్యుత్ కేంద్రం, ఎస్‌ఎల్‌బీసీ, వరద కాల్వ ద్వారా కలిపి.. మొత్తం వచ్చిన నీటిని వచ్చినట్లు వదులుతున్నారు.
అన్నదాతల మోముల్లో ఆనందం...
సింగూరు జలాశయంలో 16 టీఎంసీలకు నీరు చేరడంతో అన్నదాతల మోముల్లో ఆనందం కనిపిస్తోంది. రెండేళ్ల నిరీక్షణ తర్వాత జలాశయంలోకి భారీగా వరద చేరడంతో... ఆ దృశాన్ని కనులారా చూసేందుకు సింగూరుకు వరుస కడుతున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ప్రాజెక్ట్ వద్దకు వచ్చి నీళ్లను చూసి సంతోషంగా వెనుదిరుగు తున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు నిండకుండను సంతరించుకోవటంతో... రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.