SC Reservations in Health Department : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్విస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రుల్లో పోషకాహారం అందించే సంస్థలతో పాటు పారిశుద్ధ్య, భద్రతా సిబ్బంది నిర్వహణ సంస్థల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. కాగా ఏయే ఆసుపత్రులకు రిజర్వేషన్లు కల్పించాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు. అమలు ప్రక్రియను పర్యవేక్షించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ పనిచేయనుంది.
పూర్తి వివరాలు..
- 100 పడకల్లోపు ఉండే ఆసుపత్రులు ‘ఎ’ కేటగిరీలో.. 100-500 పడకల్లోపు ఆసుపత్రులు ‘బి’ కేటగిరీలో వస్తాయి.
- 500 పడకలకు పైబడిన ఆసుపత్రుల్లో రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. అంటే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంజీఎం తదితర ఆసుపత్రుల్లో రిజర్వేషన్లు వర్తించవు.
- ఏయే ఆసుపత్రులకు రిజర్వేషన్ కల్పించాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు.
- 100 పడకల్లోపు ఆసుపత్రులు 122లో 20, 100-500 పడకల్లోపు ఆసుపత్రులు 53లో 8 దవాఖానాలు ఎస్సీలకు 16% రిజర్వేషన్ కింద వస్తాయి.
- ఏజెన్సీ దరఖాస్తుల నిబంధనల్లో కనీస వార్షిక టర్నోవర్‌ను ఎస్సీలకు 50% తగ్గించాలి.
- రిజర్వుడ్ ఆసుపత్రి టెండర్లలో ఒక్క బిడ్ వచ్చినా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కటీ రాకపోతే మరోసారి టెండర్ ఆహ్వానించాలి. అప్పుడూ బిడ్లు రాకపోతే అందరికీ అవకాశం కల్పించాలి.
- రిజర్వేషన్ల అమలు ప్రక్రియను పర్యవేక్షించడానికి వైద్యవిద్య సంచాలకుడు, వైద్య విధాన పరిషత్ కమిషనర్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ సభ్యులుగా ఉన్న కమిటీ పనిచేస్తుంది.