దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అందుకు అవసరమైన నిధుల కేటాయింపు కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు సంబాని చంద్రశేఖర్ కోరారు. దళితుల సంక్షేమం కోసం ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ స్వాగతిస్తుందని వారు స్పష్టం చేశారు. కేసీఆర్ ఇప్పుడు ఒక్క హుజూరాబాద్‌లోనే దళిత బంధు ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు.
దళితుల కుటుంబానికి 10 లక్షల రూపాయలు కేటాయించాలంటే ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు సరిపోవని పేర్కొన్నారు. వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు చేసి ఆమోదం తెలపాలన్నారు. గతంలో ఎస్సీ కుటుంబాలకు 3 ఎకరాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారని.. అసెంబ్లీలో కూడా చెప్పారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కొని పరిశ్రమలకు ఇస్తున్నారని విమర్శించారు.
ఒక్క ఫార్మా సిటీ కోసం ఒక్క గ్రామంలోనే 1,026 ఎకరాల ఎస్సీల భూమి లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. కొకపేట, కూకట్పల్లి భూములు ఎకరాకు 8 లక్షలకు లాక్కొని కోట్ల రూపాయలకు పరిశ్రమలకు అమ్ముకుంటూ దళితులను మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయాలపై కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఎస్సీల సాధికారత కొత్తగా వచ్చింది కాదు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజనులు, మైనారిటీల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పేదలకు భూములు పంచారు.'
-కోదండ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు
'దళిత బంధు రాష్ట్రమంతటా కాకుండా ఒక్క హుజూరాబాద్‌లోనే ఎందుకు అమలు చేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉపఎన్నిక రావాలి. ఉపఎన్నిక వస్తేనే అన్ని పథకాలు అమలు అవుతాయని ప్రజలకు కూడా అర్థం అయింది. మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. రూ.2 వేల కోట్ల రూపాయలు మునుగోడుకు ఇస్తే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.'
-మహేశ్ కుమార్ గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇదీ చదవండి: Fight: చెక్కుల పంపిణీపై వివాదం... భాజపా-తెరాస మధ్య ఫైట్