కొవిడ్ కొత్త వేరియంట్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు తమ వంతు సహకారం అందిస్తుందని ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. ఇవాళ వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీనివాసులు శెట్టి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య మౌళిక సదుపాయాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. 2015లో ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాల సేవలు బ్యాంకింగ్ సేవలకు మించిన సేవలుగా అభివర్ణించారు. ప్రజలకు వైద్యపరమైన మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ అంబులెన్స్ వాహనాన్ని బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసుల శెట్టి అందించారు.
అదే విధంగా కొవిడ్‌తో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడానికి, మూడో దశను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు కలిగిన ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకోవాలని బ్యాంక్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్ కోటిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఈ-కార్నర్‌ను శ్రీనివాసులు శెట్టి ప్రారంభించారు. నగదు డిపాజిట్ కోసం ఏటీఎం, బహుళ ఆటోమేటెడ్ టెల్లర్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగదు డిపాజిట్, ఉపసంహరణలతోపాటు పాస్‌బుక్ ప్రింటింగ్, ఖాతాల్లో బ్యాలెన్స్ చూసుకోవడం తదితర అన్ని రకాల సేవలు ఒకేచోట లభ్యమయ్యేందుకు ఈ ఆటోమేటెడ్ టెల్లర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్లను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు ఖర్చు చేసినట్లు పేర్కొన్న ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్.. మరో రెండు కోట్లు ఖర్చు పెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:
SBI: చెవిటి, మూగ విద్యార్థులకు ఎస్బీఐ లేడీస్ క్లబ్ విభాగం చేయూత