Satvik Suicide Case Update: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఇంటర్ బోర్డు ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణను ముమ్మరం చేసిన కమిటీ.. రిపోర్టులో పలు ఆసక్తి కర, కీలక విషయాలను వెల్లడించింది. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న కళాశాలలో తనకు అడ్మిషన్ లేదని పేర్కొంది. ఒక కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకొని.. మరో కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారని రిపోర్టులో తెలిపారు. కళాశాలలో అడ్మిషన్ జరిగినప్పుడు నార్సింగిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థలతోనే రశీదు తమకు ఇచ్చారని సాత్విక్ తల్లిదండ్రులు చెప్పారు.
తమకు న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సాత్విక్ ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నలుగురిపై ఐపీసీ సెక్షన్ 305 ప్రకారం కేసు నమోదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా చేసుకొని.. కళాశాల అడ్మిన్ ప్రిన్సిపల్ ఆచారి, ప్రిన్సిపల్ శివరామకృష్ణారెడ్డి, హాస్టల్ వార్డెన్ నరేశ్, వైస్ ప్రిన్సిపల్ శోభన్‌బాబులను రాజేంద్రనగర్‌లోని న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాలకు అనుగుణంగా వీరి నలుగురిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు.
అసలేం జరిగింది: మార్కులు సరిగ్గా రావడం లేదని నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం సాత్విక్ అనే విద్యార్థిని వేధింపులకు గురి చేసింది. ఆ వేధింపులు తాళలేక విద్యార్థి మార్చి 1వతేదీన కళాశాలలోని తరగతిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాజమాన్యం సరైన సమయంలో స్పందించి ఉంటే సాత్విక్ బతికేవాడని తోటి విద్యార్థులు తెలిపారు. తమ స్నేహితుడి ఆత్మహత్యకు కారణం కళాశాల యాజమాన్యమే అని వారు ఆరోపించారు. ఎప్పుడు మార్కుల గురించి సాత్విక్‌ను మానసికంగా చిత్రహింసలు చేసేవారని.. తనకు తమకు చెప్పేవాడని తోటి విద్యార్థులు పేర్కొన్నారు.
సాత్విక్ రాసిన సూసైడ్ నోట్ లభ్యం: సాత్విక్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అమ్మనాన్న నన్ను క్షమించండి అంటూ.. నా మరణానికి కారణం ఆ నలుగురే అని అందులో రాసి ఉంది. కళాశాల అడ్మిన్ ప్రిన్సిపల్ అకలంకం నర్సింహాచారి, ప్రిన్సిపల్ తియ్యగురు శివ రామకృష్ణారెడ్డి, హాస్టల్ వార్డెన్ కందరబోయిన నరేశ్, వైస్ ప్రిన్సిపల్ ఒంటెల శోభన్‌బాబులే కారణమని అందులో రాశాడు. వారు తనని మానసికంగా, కొట్టి చిత్రహింసలు చేసేవారని తెలిపాడు. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని.. న్యాయమూర్తి ముందు హాజరుపర్చి.. జైలుకు తరలించారు.
ఇవీ చదవండి: