Sankranti Rush Telangana 2024 : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ 4,484 ప్రత్యేక బస్సులను నడిపుతున్నట్లు ప్రకటించింది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి(Mahalakshmi Scheme)- ఉచిత రవాణా సౌకర్యం అమలు చేయడంతో మహిళా ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీఎస్‌ఆర్టీసీ(TSRTC) పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
ఉచిత ప్రయాణానికి మహిళలకు కీలక సూచన- ఆ కార్డు చెల్లదంటూ స్పష్టం చేసిన సజ్జనార్
హైదరాబాద్‌లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సుదుపాయం కల్పించింది. ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్‌లలో కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని బస్‌స్టేషన్‌లోని కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానం చేసింది. వీటి ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.
Sankranti Festival Effect : రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్బంగా నడిపించే ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే తీసుకుంటున్నామని యాజమాన్యం తెలిపింది. ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడంలేదని వెల్లడించింది. మహిళలు ఒరిజినల్ గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తమవెంట తీసుకురావాలని సూచించారు. ఉచిత ప్రయాణం చేసే మహిళలు కండక్టర్లకు సహకరించాలని కోరారు.
త్వరలో టీఎస్ఆర్టీసీకి 1000 ఎలక్ట్రిక్ బస్సులు
మహాలక్ష్మి -ఉచిత రవాణా సౌకర్యం ప్రత్యేక బస్సుల్లోనూ యధావిధిగా కొనసాగుతుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ నెల 7 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీ నగర్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు. ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.
"సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ బాగా పెరిగింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అదనపు బస్సులను ఏర్పాటుచేశాము. మహాలక్ష్మి -ఉచిత రవాణా సౌకర్యం ప్రత్యేక బస్సుల్లోనూ యధావిధిగా కొనసాగుతుంది. ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు 4,484 అదనపు బస్సులను నడుపుతున్నాము. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీ నగర్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు". - రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ టీఎస్‌ఆర్టీసీ
అలాంటి వారంతా పల్లె వెలుగు బస్సులు ఎక్కండి - మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్