రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళన పడుతున్నారు. మరోవైపు ఏదైనా పని మీద వెళ్లాల్సివస్తే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కుతో పాటు శానిటైజర్‌ను విధిగా వెంట పెట్టుకుంటున్నారు. ఏదైనా వస్తువును ముట్టుకుంటే చాటు శానిటైజర్ రుద్దుకుంటున్నారు. ఇల్లు చేరగానే దుస్తులు శానిటైజ్ చేసి.. స్నానం చేస్తున్నారు. కరోనాను తరిమేయాలంటే పరిశుభ్రతే ఏకైక మార్గమనే సూచనలను చాలామంది అమలు చేస్తున్నారు.
ప్రైవేటు ఉపాధ్యాయులు సైతం...
శానిటైజర్లు, మాస్కుల వినియోగం బాగా పెరిగిపోయింది. కొన్నిసార్లు దుకాణాల్లోనూ స్టాక్‌లేదు అనే సమాధానం చెబుతున్నారు. మరికొందరు ఇదే అదనుగా భావించి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఆ అవసరాలను గుర్తించిన కొంతమంది శానిటైజర్లు, మాస్కులు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు సైతం అమ్మకాలు చేపట్టారు. రహదారులపై వాహనాల్లో వివిధ వస్తువులు విక్రయించే వాళ్లూ శానిటైజర్లు, మాస్కుల విక్రయాన్నే ఏకైక మార్గంగా ఎంచుకుంటున్నారు. వ్యాపారాలు సాగక దుకాణాల అద్దెలు భారమైన మరికొందరు ఉపాధి కోసం పాట్లు పడుతున్నారు.
డిమాండ్ పెరిగిపోయింది...
హైపోక్లోరైడ్ ద్రావణాల అమ్మకాలు పెరిగాయి. కిరాణాతో పాటు ఇతర వ్యాపారులు ఎక్కువగా నోట్లను లెక్కిస్తుంటారు. అలాంటి అవసరాలకు తగ్గట్లుగా శానిటైజర్ మిషన్లను కొనుగోలు చేస్తున్నారు. శానిటైజర్ బాటిళ్లు అవసరాల మేరకు చిన్న పరిమాణం నుంచి.. లీటర్, రెండు, ఐదు లీటర్ల వరకు విక్రయిస్తున్నారు. ఫ్లోర్‌లు తుడిచే ద్రావణాలు అమ్మకాలు అధికమయ్యాయి. గ్లవ్స్, థర్మామీటర్లు, ఆక్సో మీటర్లకు సైతం డిమాండ్ పెరిగింది.
ధరలే కాదు... నాణ్యతా చూడాలి...
శానిటైజర్ల కొనుగోలు వాడకంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తయారీలో వాడే రసాయనాలతో హాని జరిగే ప్రమాదం ఉందంటున్నారు. అతిగా వాడితే మంచి బ్యాక్టీరియా నశించి ఇబ్బందులు తలెత్తుతాయని సూచిస్తున్నారు. కంటికి ఇంపుగా కనిపించే రంగులు.. సువాసనల కోసం వాడే పర్‌ఫ్యూమ్‌లతోనూ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మ సంబధమైన వ్యాధులు రాకుండా శానిటైజర్ల ఎంపికలో జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు. కొనుగోలు సమయాల్లో ధరలే కాకుండా నాణ్యతను పరిశీలించాలంటున్నారు.