కరోనా మహమ్మారి కలవరపెడుతున్నా సైనికుల్లా విధులు నిర్వహిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. వైరస్‌కు వెన్నుచూపకుండా ఎప్పటిలాగే సేవలందిస్తున్నారు. అయితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఈ కార్మికుల విషయంలో మాత్రం మున్సిపాలిటీలు తగిన శ్రద్ధ చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని వీరి పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన కాలనీల్లో, రెడ్జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లోనూ వీరు సేవలందిస్తున్నారు. ఇలాంటి కార్మికులకు అవసరమైన రక్షక కవచాలు సమకూర్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారికిచ్చే చేతి గ్లౌజ్‌లు ఒకటి రెండు రోజులకే చిరిగిపోతున్నాయి. కాంట్రాక్టు కార్మికులు వీటినీ సక్రమంగా ఇవ్వడంలేదు. మాస్క్‌లు కూడా రెండు మాత్రమే ఇస్తున్నారని కార్మికులు చెబుతున్నారు. వీటినే ఉతుక్కొని వినియోగించుకోవాలని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతులు శుభ్రపరుచుకోవడానికి శానిటైజర్లు, సబ్బులు, కొబ్బరి నూనెలు కూడా పంపిణీ చేయటం లేదని వాపోతున్నారు.
ఆహారానికీ ఇబ్బందే...
పారిశుద్ధ్య కార్మికులు లాక్‌డౌన్‌తోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టు పక్కల పల్లెల్లో ఉండేవారు తెల్లారేసరికి పట్టణాలకు రావాలి. అయితే తమకు ఎలాంటి గుర్తింపు కార్డు గానీ, ఏకరూప దుస్తులు గానీ ఇవ్వకపోవడం వల్ల పోలీసులు అడ్డుకుంటున్నారని కాంట్రాక్టు కార్మికులు చెబుతున్నారు. హోటళ్లు మూసేయటంతో ఆహారం దొరకడం కష్టంగా మారిందని అంటున్నారు. వీటితోపాటు తమకు రెండు నెలలుగా జీతాలు రావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వాలు అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరుకు కొత్త సైన్యం- ఆన్లైన్లో శిక్షణ!