దేశంలో అవసరమైన వాటికి ఎక్కువ సంఖ్యలో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ అభిప్రాయపడ్డారు. అనవసరపు సర్జరీలను తగ్గించటంతో పాటు సర్జన్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వర్చువల్ కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు.
మానవ శరీరం అత్యంత సంక్లిష్టమైనదని... దానిని పూర్తిగా అర్థం చేసుకోవటం అసాధ్యమని సద్గురు జగ్గీ వాసుదేవ్ అభిప్రాయపడ్డారు. తెలిసిన విజ్ఞానంతో వైద్యులు... మానవ ప్రాణాలను నిలబెట్టేందుకు చేసే కృషిని అభినందించిన ఆయన వెయ్యి ఏళ్ల తర్వాత వైద్య వృత్తి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందన్నారు. ఒక్క శస్త్రచికిత్స కోసం వంద మంది వివిధ విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులు అవసరం పడవచ్చని అభిప్రాయపడ్డారు.
ఒత్తిడిలో ఉన్న సర్జన్ అత్యంత ప్రమాదకరమన్న ఆయన... దేశంలో సర్జన్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. వైద్య రంగంలో మౌళిక వసతుల పెంపుతో పాటు వైద్య విద్యను మరింత వృద్ధి చేసేందుకు దేశంలో విరివిగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పాశ్చాత్య, పురాతన వైద్య విధానాలు ఒకదానితో ఒకటి సమాంతరంగా వృద్ధి చెందగలవా అన్న డాక్టర్ రఘురాం ప్రశ్నకు స్పందించిన సద్గురు... పాశ్చాత్య, పురాతన వైద్యాలు రెండూ ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: భూసేకరణలో జాప్యం వల్లే పనుల్లో ఆలస్యం: కిషన్ రెడ్డి