కరోనా ఉద్ధృతి దృష్ట్యా పంచాయతీరాజ్ సంస్థల్లోని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డుసభ్యుల ఖాళీలకు ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఖాళీలకు ఎన్నికల నిర్వహణ విషయమై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 124 సర్పంచ్, 60 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానంతో పాటు 2,280 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ గత నెల 15తోనే పూర్తి అయింది. అయితే కొవిడ్ విజృంభణ దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సరికాదన్న ఉద్దేశంతో వాయిదా వేశారు. పరిస్థితులు చక్కబడ్డాక వైద్యశాఖ అధికారులను సంప్రదించి, ప్రభుత్వ ఆమోదంతో ఎన్నికల నిర్వహణకు తుదినిర్ణయం తీసుకుంటామని పార్థసారథి తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో లాక్డౌన్ 2.0... తాజా నిబంధనలు ఇవే..!