లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సులు ఎప్పుడెప్పుడు నడుస్తాయా... అని ప్రజలు ఎదురు చూశారు. తీరా సిటీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాక.. జనాల స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఆర్టీసీ బస్సు సర్వీసులు ఆగస్టు నెల 26వ తేదీన ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన రోజు కేవలం 12శాతం మాత్రమే ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. లాక్డౌన్కు ముందు గ్రేటర్ పరిధిలో 2,500ల ఆర్టీసీ బస్సులు నిత్యం 8.20లక్షల కిలోమీటర్లు తిరుగుతూ... 32 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేవి.
25 శాతం ఆర్టీసీ బస్సులు
లాక్డౌన్కు ముందు గ్రేటర్ పరిధిలో ఆక్యుపెన్సీ రేషియో 69శాతం ఉండేది. లాక్డౌన్ తర్వాత కేవలం ప్రైవేట్ వాహనాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ప్రజా రవాణా వ్యవస్థ తిరిగి అందుబాటులోకి రావడం వల్ల.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు యథావిధిగా ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేశారు. తొలుత 25శాతం బస్సులను నడిపించారు. అలా గ్రేటర్ పరిధిలో సుమారు 2లక్షల కిలోమీటర్ల వరకు 25శాతం ఆర్టీసీ బస్సులు ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. వీటితో పాటు గ్రేటర్ శివారులోని ప్రాంతాలకు సుమారు 230 బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పుతున్నారు.
ఆక్యుపెన్సీ తగ్గింది..
ఈనెల 26న ఆర్టీసీ సిటీ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన రోజు 12శాతం, ఆ తర్వాత రోజు 27న 20శాతం, 28 న 30శాతం మాత్రమే ఆక్యుపెన్సీ రేషియో వచ్చిందని అధికారులు లెక్కలు తీశారు. తక్కువ బస్సులు నడిపినప్పటికీ... ఆక్యుపెన్సీ రేషియో తగ్గడం అధికారులను విస్మయపరుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న బస్సులకు వచ్చే ఆదరణను బట్టి... మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి : కొవాగ్జిన్ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు: గవర్నర్