బస్టాండ్లలోని స్టాళ్లలో అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్లలోని కొందరు షాపుల యజమానులు నిబంధనలకు విరుద్ధముగా ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు వస్తువులు అమ్మినట్లు ఫిర్యాదులు రావటంతో ఆయన స్పందించారు. అధికంగా డబ్బులు వసూలు చేసిన షాపు యజమానులకు, నకిలీ బ్రాండ్‌తో వస్తువులు అమ్ముతున్న వారికీ, ఉచితంగా వాడుకునే మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలు చేసిన వారికి అధిక మొత్తంలో జరిమానాలు విధించడంతో పాటు ఒప్పందం రద్దు చేసేందుకు ఆర్టీసీ ఎండీ నోటీసులు జారీచేశారు.
ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ బస్‌స్టేషన్, జేబీఎస్, సూర్యాపేట, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హన్మకొండ బస్స్టేషన్లలో తనిఖీ చేసి రూ. 52వేల జరిమానాను విధించడంతో పాటు నోటీసులు జారీ చేశామని సజ్జనార్ తెలిపారు . తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని వివిధ బస్ స్టేషన్లలోని ఖాళీ స్థలాలను, షాపులను వివిధ వాణిజ్య అవసరాల కొరకు అద్దె ప్రాతిపదికన టెండర్ల ద్వారా పరిమిత కాలానికి నియమ నిబంధనలకు లోబడి కాంట్రాక్టుకు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.
నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వివిధ రకాల క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్ట్‌ను రద్దుచేస్తామని ఎండీ స్పష్టం చేశారు. బస్టాండ్లలోని ఏ షాపులోనైనా ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు వస్తువులు అమ్మినా, నకిలీ వస్తువులు అమ్మినా, నిషేదిత వస్తువులు అమ్మినా బస్స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్, కంట్రోలర్‌కు ఫిర్యాదు చేస్తే సదరు షాపులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆర్టీసీ అభివృద్ధి కోసం..
ఆర్టీసీని తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన అన్ని అంశాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టి సారించారు. ఆ దిశగా చర్యలను కూడా ప్రారంభించారు.ప్రయాణికుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా ఆర్టీసీ సేవలందిస్తుందని ఆయన గతంలోనే వెల్లడించారు. ప్రయాణికులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ అభివృద్ధితో పాటు ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను(TSRTC Dasara special buses) ఏర్పాటు చేసింది. అంతే కాకుండా కాలనీలకే బస్సులు పంపే ఏర్పాట్లు చేశారు.
సలహాలు, సూచనల కోసం..
టీఎస్ఆర్టీసీ(Tsrtc)కి ప్రయాణికులే పరమావధిగా భావిస్తూ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(tsrtc md sajjanar) ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాలు, ఆర్టీసీలో ఎదురయ్యే ఇబ్బందులు, సంస్థ అభివృద్దికి సలహాలు, సంస్థ లోపాలపై ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ఓ ట్విట్టర్ ఖాతా(Tsrtc twitter)ను కూడా ప్రారంభించి పలువురి సలహాలను, సూచనలను స్వీకరిస్తున్నారు.
ఇదీ చదవండి: Revanth Interesting Comments: హరీశ్‌రావును ఇంటికి పంపేందుకు కేసీఆర్ ప్రణాళిక: రేవంత్