హైదరాబాద్ నగరంలో దక్షిణమధ్య రైల్వేకు ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. లాలాగూడలో ఉన్న ఈ రైల్వే కేంద్ర ఆసుపత్రిలో.. సంబంధిత ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన సిబ్బందితోపాటు వారి కుటుంబీకులకూ వైద్యం లభిస్తోంది. రోగుల అవసరాల మేరకు ఇక్కడ వైద్య సేవలనూ ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో 60 పడకలతో ప్రత్యేకంగా వార్డునూ సిద్ధం చేసి వైద్యులను కూడా నియమించారు. ప్రస్తుతం రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబీకుల్లో ఎవరికైనా కరోనా సోకితే వారందరికీ అక్కడే వైద్యం అందిస్తున్నారు.
ప్రజారవాణాలో అగ్రగామిగా ఉన్న ఆర్టీసీ మాత్రం ఈతరహా సేవలకు దూరంగా ఉండిపోయింది. 1970లో తార్నాకలో ఆర్టీసీ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. 200 పడకల ఈ ఆసుపత్రిలోని వైద్యులు ప్రాథమికంగా చికిత్స అందిస్తారు. ఆపై శస్త్ర చికిత్సలుంటే ఆయా రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రస్తుతమిక్కడ నిర్ధారణ పరీక్షలు కూడా చేపట్టడం లేదు. ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పినా సంబంధిత హామీ కార్యరూపం దాల్చలేదు.
కనీస వైద్యం కరవు
టీఎస్‌ఆర్టీసీలో మొత్తం 47 వేల మంది ఉద్యోగులున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోనే 20 వేల మందికిపైగా ఉన్నారు. సంస్థ తరఫున వైద్యసేవలు పొందాలంటే తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికే వీరంతా వెళ్లాల్సి ఉంటుంది. కరోనా రెండో దశ నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బంది ఎవరైనా మహమ్మారి బారినపడితే.. వారికి చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో 100 పడకలనైనా సిద్ధం చేయాల్సి ఉంది. కనీసం ఐసొలేషన్ వార్డులను అందుబాటులోకి తెచ్చినా కాస్త ఉపశమనంగా ఉండేది. ఇక్కడి చికిత్స పొందే క్రమంలో ఎవరైనా కరోనా బాధితుల పరిస్థితి విషమిస్తే.. వారిని నేరుగా గాంధీ ఆసుపత్రిలో చేర్చుకునేలా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది. వీటిల్లో ఏ ఒక్క సౌకర్యం కల్పించే విషయమై నేటికీ దృష్టి సారించలేదు. విధి నిర్వహణలోభాగంగా ప్రతి డ్రైవర్, కండక్టర్ ప్రతిరోజూ 500 నుంచి 600 మంది ప్రయాణికులను దగ్గరగా కలుస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ప్రతి డిపో పరిధిలో 20 మందికి పైగా సిబ్బంది మహమ్మారి బారినపడ్డారు. ప్రస్తుతం ఇళ్లలోనే చికిత్స పొందుతున్న వారికి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా సమస్యే.
ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవడంలో ముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కొవిడ్ వేళ వారికి మెరుగైన వైద్యసేవలు లభించేలా కూడా చొరవచూపాలి. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని కాలానుగుణంగా విస్తరించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు లోపించాయి. స్థానికంగా 50 మంది వైద్య సిబ్బంది అవసరం కాగా.. ప్రస్తుతమిక్కడ 25 మందే పని చేస్తున్నారు. ప్రసవాలు తప్పించి ఇతర శస్త్రచికిత్సలేవైనా ప్రైవేటును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా వేళ బాధితులకు చికిత్స అందేలా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దితే వేలాది మంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబీకులకు ఊరటగా ఉంటుంది.- ఎ.ఆర్.రెడ్డి, టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి