ఆర్టీఏ చాట్ బాట్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ సేవలకు గానూ... రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం.రావుకు పురస్కారం లభించింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన డిజిటల్ సభలో పురస్కారం అందించారు. రాష్ట్ర ఐటీ శాఖ సహకారంతో రూపొందించిన ఆర్టీఏ చాట్ బాట్ ద్వారా వినియోగదారులు తమ సందేహాలు, ప్రశ్నలను సంధిస్తే వాటికి సత్వరమే సమాధానం ఇచ్చే విధంగా సేవల్ని అందిస్తున్నామని కమిషనర్ ఎంఆర్ఎం.రావు పేర్కొన్నారు.
పౌర సేవల్ని మరింత మెరుగు పరిచే దిశలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని కమిషనర్ వెల్లడించారు. వినియోగదారుల డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు, వాహనాల సేవలకు సంబంధించిన ప్రశ్నలు అడిగిన వెంటనే సమాధానాలు ఇవ్వడం ఆర్టీఏ చాట్ బాట్ ప్రత్యేకత అని వివరించారు. వినియోగదారుల ప్రశ్నలు ప్రత్యేకమైన ఐడీతో డేటా బేస్‌లో నిల్వ చేయడం జరుగుతోందన్నారు. పారదర్శకంగా సేవల్ని అందించేందుకు తగిన కృషి చేస్తున్నామన్నారు. సర్వర్ షిప్టింగ్ సాంకేతిక కారణాల వల్ల చాట్ బాట్ సేవల్ని మెరుగైన రీతిలో కొద్ది కాలంలోనే పునరుద్ధరించడం జరుగుతుందని రవాణాశాఖ కమిషనర్ తెలిపారు.