RS Praveen Kumar fire on KTR: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ కేసుతో కుటుంబ ప్రమేయం ఉంది కాబట్టే.. ముఖ్యమంత్రి మాట్లాడటం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లక్డీకపూల్ బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేటీఆర్ టీఎస్‌పీఎస్సీ తరపున వకల్తా పుచ్చుకుని పూర్తిగా నియంత్రిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకు అప్పగించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆరోపణలు మంత్రి కేటీఆర్‌కు ఎందుకు వస్తున్నాయి..? ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు..? అని ప్రశ్నించారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కేటీఆర్ ఆ జిల్లాలో ఏ గ్రామంలో ఎంత మంది టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాశారు..? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి..? అనే గణాంకాలు క్లుప్తంగా ఎలా చెప్పారని ఆక్షేపించారు.
పరోక్షంగా పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారులు కేటీఆర్‌తో టచ్‌లో ఉంటున్నారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ సహా సభ్యులందరూ ఇందులో బాధ్యులేనని.. ఉద్యోగాల నుంచి తప్పించి వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారికి కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ప్రతి అంశం కేటీఆర్ మాట్లాడటం సరికాదని.. ఆయనకు కూడా సిట్ నోటీసులు ఇవ్వాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన పీఏ తిరుపతిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సిరిసిల్ల జిల్లా ఆత్మీయ సభలో కేటీఆర్ అన్నారు. మల్యాల మండలంలో 415 మంది పరీక్షకు హాజరైతే.. 35 మంది మాత్రమే గ్రూప్-1 నుంచి అర్హత సాధించారని తెలిపారు. తిరుపతి స్వగ్రామంలో ముగ్గురు పరీక్ష రాస్తే.. ఒక్కరు కూడా అర్హత సాధించలేదని కేటీఆర్ వివరణ ఇచ్చారు.
"టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారంలో సిట్ నోటీసులు ఇస్తే తప్పకుండా స్పందిస్తా.. బండి సంజయ్ కుమార్ లాగా పారిపోను. అన్ని ఆధారాలు అందజేసి సిట్‌కు పూర్తిగా సహకరిస్తా.. టీఎస్‌పీఎస్సీ కుంభకోణంపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు. అందులో మీ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది కాబట్టే మీరు ఈ వ్యవహారం గురించి మాట్లాడం లేదు. ఇవాళ మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మీడయాతో ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడటం లేదు".- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి:
'కోర్టుకు నివేదిక ఇవ్వకుండానే వివరాలన్నీ కేటీఆర్ ఎలా చెప్పారు..?'
సిట్ విచారణకు హాజరుకాని బండి సంజయ్.. ఆయన తరపున లీగల్ టీం..
పోలీసులు, వైఎస్ఆర్టీపీ కార్యకర్తల మధ్య తోపులాట.. కిందపడిపోయిన వైఎస్ షర్మిల