RS Praveen Alleged KCR Family Involvement TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సీఎం కుటుంబీకులకు సంబంధం ఉందని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ లీకేజీ వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నాయని.. వెంటనే ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లకు లై డిటెక్టివ్ పరీక్ష చేయాలని కోరారు. అలాగే సీఎంఓ ఉద్యోగులు, టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేసి.. అందులో వారి హస్తం ఉందో లేదో తేల్చాలని సూచించారు. పేపర్ లీకేజీ అంశంపై విపక్షాలతో సంప్రదించి.. ఐక్య ఉద్యమాలు చేస్తామని తేల్చి చెప్పారు. అయితే ఈసారి నాడు తెలంగాణ కోసం ఎలాగైతే ఉద్యమం చేశారో.. నేడు కూడా అలాగే మరో సకల జనుల సమ్మెకు వెళుతున్నట్లు చెప్పారు.
TSPSC Leakage Updates: త్వరలోనే దిల్‌సుఖ్‌నగర్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వద్దకు వెళ్లి.. పేపర్ లీకేజీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, గ్రూప్ 1, మిగిలిన పరీక్షల రద్దుపై ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి వెళుతున్నట్లు స్పష్టం చేశారు. అభ్యర్థులకు రూ. 5లక్షలు చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అసలు దొంగలను పక్కన పెట్టి ఎంతసేపూ ప్రవీణ్, రాజశేఖర్‌ల చుట్టూనే ఈ వ్యవహారం మొత్తం పోనిస్తున్నారని సిట్‌పై మండిపడ్డారు. పేపర్ లీకేజీ విషయంలో దోషులను శిక్షించకపోతే.. తెలంగాణ అగ్నిగుండంగా మారనుందని హెచ్చరించారు. టీఎస్‌పీఎస్సీలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు బయటకు వెళ్లి గ్రూప్1 పరీక్షను రాశారని.. వారే టాప్ 500 ఉన్నారనే సమాచారం. ఈ విషయంపై కూడా సిట్ దర్యాప్తు చేయాలని కోరారు.
వెంటనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ను భర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరడం జరిగిందన్నారు. ఈ పేపర్ లీకేజీకు నైతిక బాధ్యత వహిస్తూ ఛైర్మన్ రాజీనామా చేసి.. పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని సూచించారు. టీఎస్‌పీఎస్సీలో రాజకీయ నాయకులను, ఉద్యోగ సంఘాల నాయకులను ఈ ప్రభుత్వం సభ్యులుగా నియమించింది.. గతంలోనే వీరే పేపర్‌ను లీక్ చేసి అరెస్ట్ అయ్యారని గుర్తుచేశారు. కావున వీరి కాల్ డేటాలను కూడా సిట్ పరిశీలించాలన్నారు. 2016లో టీఎస్‌పీఎస్సీలో జరిగిన అవకతవకల గురించి కూడా దర్యాప్తు చేయాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
"కేటీఆర్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో ఇది చాలా చిన్న విషయంగా చూస్తున్నారు. దేశంలో అత్యున్నతమైన కమిషన్‌గా పేరుందని కేటీఆర్ అన్నారు. దేశంలోనే అత్యున్నతమైన కమిషన్ టీఎస్‌పీఎస్సీలో 25పేపర్లు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా లీకేజీ అయ్యింది." - ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: